- తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీ
- ప్రజల కష్టాలే తన కష్టాలుగా సమస్యలు ఆరా
- లుంగీలోనే తిరుగుతూ సమస్యల పరిష్కారం
- సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తానని బాలికకు హామీ
- సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ఎంపీ
సహనం వందే, విజయనగరం:
విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అప్పలనాయుడు… మాస్ లీడర్
రాజకీయ హోదా, అధికారిక లాంఛనాలను పక్కనపెట్టి సామాన్య వ్యక్తిగా గిరిజనులలో కలిసిపోయారు అప్పలనాయుడు. ఆయన్ని చూడగానే గిరిజనులు తమ సంప్రదాయమైన దింషా, డప్పు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీ అన్ని విభాగాల అధికారులను వెంటపెట్టుకుని అక్కడే గ్రామసభ నిర్వహించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ వంటి కీలక శాఖల అధికారులు నేరుగా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
గిరిజనులు తమ సమస్యలను ఎంపీకి విన్నవించారు. ఈ ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో తమకు మేలు జరుగుతోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు తమ జీవితాలను మార్చాయని వారు తెలిపారు.
బాలికకు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తా…
గ్రామసభలో ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్ళు కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు జిల్లా కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. పల్లెనిద్ర తర్వాత ఉదయాన్నే ఆయన కాలినడకన ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని చదువు పట్ల చూపిన ఆసక్తిని చూసి ఆమెకు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ గిరిజనుల హృదయాలను గెలుచుకుంది.
పల్లె ప్రజల గుండెల్లో ఎంపీ
అప్పలనాయుడు గిరిజన ప్రాంతాల పర్యటన ప్రజల జీవితాలను, వారి అవసరాలను దగ్గర నుంచి చూడటానికి ఉపయోగపడింది. ఈ పర్యటన సారాంశాన్ని ఒక నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని ఎంపీ ప్రకటించారు. మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలతో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి, పాలనను ప్రజల వద్దకు తీసుకురావడంలో అప్పలనాయుడు ముందున్నారు. ఈ చర్యలతో ఆయన గిరిజనుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. అప్పలనాయుడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి అక్కడే పల్లెనిద్ర చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. నాయకుడు ఇలా ప్రజల్లో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.