మోడీకి ఎంపీ కలిశెట్టి బర్త్ డే గిఫ్ట్ – ప్రధాని జన్మదినం సందర్భంగా పల్లెనిద్ర

  • గిరిజన ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటిస్తే…
  • అదే స్ఫూర్తిగా అప్పలనాయుడు గిరిజన బాట
  • తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీ
  • ప్రజల కష్టాలే తన కష్టాలుగా సమస్యలు ఆరా
  • లుంగీలోనే తిరుగుతూ సమస్యల పరిష్కారం
  • సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తానని బాలికకు హామీ
  • సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ఎంపీ

సహనం వందే, విజయనగరం:
ప్రధాని మోడీకి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అదేదో వస్తువు అనుకునేరు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రత్యేకంగా పర్యటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ అప్పలనాయుడు ఒక గిరిజన గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు.ఆ తర్వాత గురువారం ఉదయం లుంగీ మీద పొలాల గట్లపై తిరుగుతూ రైతులతో సంభాషించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత గడపగడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పటివరకు ఏ విజయనగరం ఎంపీ కూడా పల్లెనిద్ర చేయలేదని స్థానికులు చెప్తున్నారు. పల్లెనిద్ర, గ్రామసభ, రచ్చబండ వంటి కార్యక్రమాలతో గిరిజనులకు మరింత చేరువయ్యారు. అప్పలనాయుడి చొరవను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు.

సామాన్యుడిగా ప్రజలతో మమేకం…
రాజకీయ హోదాను పక్కన పెట్టి ఒక సాధారణ మనిషిలా వారిలో ఒకరిగా అప్పలనాయుడు మారిపోవడం గిరిజనులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే వారు తమ సంప్రదాయ నృత్యాలైన దింషా, డప్పు వాయిద్యాలతో, బాణాసంచాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అప్పలనాయుడు అన్ని విభాగాల అధికారులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేసి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ వంటి కీలక రంగాల అధికారులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇచ్చారు. ప్రజలు కూడా ఏమాత్రం భయపడకుండా తమ సమస్యలను ఎంపీకి నివేదించారు. ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సకాలంలో అందుతున్నాయని, ముఖ్యంగా తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలతో తమకు ఎంతో మేలు జరుగుతోందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం…
గ్రామసభలో ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు జిల్లా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. పల్లెనిద్ర తర్వాత ఉదయాన్నే ఆయన కాలినడకన గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థినిని ప్రోత్సహించి ఆమెకు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం గిరిజనుల హృదయాలను గెలుచుకుంది.

ప్రజల వద్దకు పాలన
ఈ పర్యటనలో ప్రజల జీవితాలను, వారి అవసరాలను ఎంపీ అప్పలనాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటన సారాంశాన్ని ఒక నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని ప్రకటించారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలతో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఎంపీ పాలనను ప్రజల వద్దకు తీసుకురావడంలో ముందున్నారు. ఈ చర్యలు గిరిజనుల హృదయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *