- ప్రపంచవ్యాప్తంగా యువతరం దండయాత్ర
- నేపాల్ నుంచి ఫ్రాన్స్, మలేషియా వరకు ఇదే
- గడ్డితో అల్లిన టోపీ గుర్తుతో యూత్ దూకుడు
- అనేక దేశాల్లో ఈ గుర్తుతో భారీ ఉద్యమాలు
- నేపాల్ లో ప్రభుత్వాన్ని కూల్చేసిన జెన్ జెడ్
సహనం వందే, న్యూఢిల్లీ:
ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన చిహ్నంగా మారింది. 2025 ఆగస్టు 17న ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో దేశీయ టోపీని ప్రోత్సహించగా యువత మాత్రం ఈ పైరేట్ టోపీ గుర్తుతో తమ నిరసనను వ్యక్తం చేసింది. కొందరిని అరెస్ట్ చేసినా నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.
నేపాల్‌లో జెన్ జెడ్ తుఫాన్…
ఇండోనేషియా యువతను చూసి నేపాల్‌లోని యువత కూడా స్ఫూర్తి పొందింది. సెప్టెంబర్ 8న ప్రధాన మంత్రి కెపీ శర్మ ఒలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించినప్పుడు అది యువత స్వేచ్ఛకు ఒక సవాలుగా భావించారు. దీంతో వేలాది మంది యువకులు, విద్యార్థులు ఖాఠ్మాండు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. వారి చేతుల్లో అదే పైరేట్ టోపీ గుర్తు. 19 ఏళ్ల రోహన్ రాయ్ లాంటి యువత ఈ టోపీని అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛకు చిహ్నంగా భావించారు. ఈ నిరసనల కారణంగా 19 మంది మరణించగా 500 మంది గాయపడ్డారు. చివరకు పోలీసుల హింస కారణంగా హోం మంత్రి రమేష్ లెఖక్ రాజీనామా చేయగా, ప్రధానమంత్రి ఓలి కూడా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఈ ఉద్యమం యువతకు విజయాన్ని సాధించిపెట్టింది.
ప్రపంచవ్యాప్త ప్రభావం…
ఈ ఉద్యమం కేవలం ఇండోనేషియా, నేపాల్‌కే పరిమితం కాలేదు. ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, ఇటలీ, పెరూ, మయన్మార్ దేశాల యువత కూడా ఈ పైరేట్ టోపీ గుర్తుతో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. గాజా యుద్ధ సంబంధిత ప్రదర్శనల్లో కూడా ఈ చిహ్నం కనిపించింది. వన్ పీస్ కథలో హీరో లూఫీ ప్రపంచ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినట్టే, ఇప్పుడు ఈ యువత ప్రపంచంలోని ప్రభుత్వాల అవినీతి, అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ టోపీల చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ఒక కార్టూన్ పాత్రకు సంబంధించిన చిహ్నం కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా యువతరం చేపట్టిన తిరుగుబాటుకు సంకేతంగా మారింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను మార్చగలదని నిపుణులు భావిస్తున్నారు.