- అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ
- ఊరట కన్నా ఉద్యోగులకు నిరాశే ఎక్కువ
- మూడేళ్లకు పరిమితమైన ఊరట
- అధికారుల చేతిలో అడ్డగోలు అధికారం?
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి.
అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…
ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం జారీ చేసిన అర్హత నిబంధనలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. 2021 జనవరి 6 నాటికి ఏ కేడర్‌లో ఉన్నారో, అదే కేడర్‌లో ఉన్నవారికే ఈ అవకాశం ఉంటుందని జీవోలో స్పష్టంగా పేర్కొనడం పలువురిని నిరాశపరుస్తోంది. అంతేకాదు మ్యూచువల్ లేదా స్పౌస్ బదిలీలు పొందిన ఉద్యోగులు… జీవో 317 కింద మొదటి ఆప్షన్ జిల్లాకు కేటాయించినవారు… క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నవారు… పదోన్నతి పొందినవారు సైతం ఈ బదిలీలకు అనర్హులుగా ప్రకటించబడటం గమనార్హం. ఈ కఠిన నిబంధనల వల్ల అవసరం ఉన్న చాలా మంది ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోలేరని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మూడేళ్లకు పరిమితమైన ఊరట…
తాత్కాలిక బదిలీల కాలపరిమితి కేవలం మూడు సంవత్సరాలకు పరిమితం చేయడంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగా రెండేళ్ల కాలానికి ఇచ్చే ఈ బదిలీలను అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ… ఈ కాలం పూర్తయ్యాక ఉద్యోగి తప్పనిసరిగా తన మాతృ కేడర్‌కు తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఒకరకంగా తాత్కాలిక ఉపశమనం మాత్రమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని, తిరిగి సొంత జిల్లాల నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ తాత్కాలిక బదిలీల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవని, ప్రయాణ భత్యం లేదా దినసరి భత్యం కూడా లభించదని జీవోలో స్పష్టం చేయడం వారికి ఆర్థిక భారాన్ని పెంచుతోంది.
అధికారుల చేతిలో అడ్డగోలు అధికారం?
ఈ బదిలీల ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు ఇవ్వడంపైనా విమర్శలు వస్తున్నాయి. సంబంధిత పరిపాలనా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు లేదా కార్యదర్శులు మాత్రమే ఈ ఉత్తర్వులను జారీ చేస్తారని పేర్కొన్నారు. అంతేగాకుండా దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని జీవోలో పేర్కొన్నారు. అయితే ఏ నిబంధనలు పాటించి బదిలీలు జరపాలన్న దానిపై స్పష్టత లేకపోవడం, అధికారుల వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంమీద ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలు… నిజానికి వారి ఆశలను నీరుగార్చాయనే భావన బలంగా వినిపిస్తోంది. ఈ నిబంధనలు ఎంతమేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలవుతాయో వేచి చూడాలి.