ఎత్తుకు వైద్యం… వికటిస్తే వైకల్యం – ఫ్యాషన్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత

  • నెలల తరబడి వీల్‌చెయిర్‌కే అంకితం
  • చైనా లాంటి దేశాలు నిషేధించిన శస్త్రచికిత్స
  • కానీ వ్యాపారం కోసం ఆసుపత్రుల దోపిడి
  • సినీ, స్పోర్ట్స్ స్టార్లను చూసి యువత మోజు
  • హైదరాబాదులో గతంలో వికటించిన కేసులు
  • ఇప్పటికీ ఇష్టారాజ్యంగా చేస్తున్న డాక్టర్లు
  • డబ్బులిస్తే చూసి చూడనట్లు వదిలేస్తున్నారు

సహనం వందే, హైదరాబాద్:
ఎత్తు పెరగాలనే కోరిక… దానికోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పరిస్థితి దాపురించడం ఒక ఆందోళన కలిగించే అంశం. వ్యాయామం, సరైన ఆహారం, చిట్కాలు లాంటివి ఫలితం ఇవ్వనప్పుడు యువత ఫ్యాషన్ కోసం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఎత్తు పెంచే వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే దీనిలోని ప్రమాదాలను బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలోనూ ముఖ్యంగా ధనిక వర్గాల్లో ఈ ప్రమాదకరమైన ట్రెండ్ విస్తరిస్తోంది.

వైద్యం నుంచి ఫ్యాషన్ వరకు…
ఎముకలకు సంబంధించిన వైకల్యాలు, పుట్టుకతో వచ్చిన లోపాలు ఉన్నవారికి మాత్రమే మొదట్లో ఈ ఆపరేషన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. హాలీవుడ్ సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం ఈ ట్రెండ్‌ను మరింత పెంచాయి. ఈ ఆపరేషన్లలో వైద్యులు కాళ్ల ఎముకలను రెండు భాగాలుగా కోసి వాటిని నెమ్మదిగా విస్తరించేందుకు ఒక పరికరాన్ని అమరుస్తారు. ఈ ప్రక్రియ చాలా నొప్పిగా ఉంటుంది. రోగులు నెలల తరబడి వీల్‌చెయిర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

నరకయాతనతో కూడిన ప్రయాణం
ఈ ఆపరేషన్ ఎంతో బాధాకరమైనది. దీనివల్ల నెలల తరబడి మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ ఎముకలు వేగంగా పెరిగితే అవి బలహీనంగా మారి విరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నరాలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు, శాశ్వత వైకల్యం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. బ్రిటన్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ టిమ్ బ్రిగ్స్ దీని గురించి హెచ్చరిస్తూ, ‘ఈ ఆపరేషన్ అనేది తక్షణ పరిష్కారం కాదు. ఇది దీర్ఘకాల బాధలు, వైకల్యానికి దారితీస్తుంద’ని అన్నారు. హైదరాబాదులోనూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు ఈ ప్రమాదకర ఆపరేషన్లను నియంత్రణ లేకుండా నిర్వహిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీదైన ప్రమాదం…
ఈ ఆపరేషన్ ఖర్చు కూడా ఆకాశాన్ని తాకుతోంది. బ్రిటన్‌లో ఈ ఆపరేషన్‌కు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, టర్కీలో 24 లక్షలు అవుతుంది. భారతదేశంలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో 15 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. చైనా లాంటి దేశాలు ఈ ఆపరేషన్లను నిషేధించాయి. భారతదేశంలోనూ ఈ నియంత్రణ లేని వైద్య సేవలు యువతను ఆకర్షిస్తున్నాయి. కొద్దిపాటి అంగుళాల ఎత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టడం సమంజసం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాయలో పడిన యువత…
భారతదేశంలో ఈ ప్రమాదకర ట్రెండ్ ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లోని ధనిక వర్గాల్లో పెరుగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినిమా తారల అందం ఆదర్శాలు యువతను ఈ ప్రమాదకర శస్త్రచికిత్స వైపు నడిపిస్తున్నాయి. అయితే భారతదేశంలో ఈ శస్త్రచికిత్సలను నియంత్రించే స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, అనర్హులైన క్లినిక్‌లలో ఆపరేషన్లు జరగడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. చివరిగా వైద్యులు, అందం అనేది సహజమైనదని, ఈ విపరీత ఫ్యాషన్ల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని యువతను కోరుతున్నారు.

హైదరాబాదులో వికటించిన కేసులు…
ఎత్తు పెంచడం కోసం కొన్ని ఆసుపత్రులు యువతను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాదులో ప్రముఖ ఆసుపత్రులలో ఇష్టారాజ్యంగా తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎత్తు పెంచే ఆపరేషన్లు చేస్తున్నట్టు గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. ఒకటి రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఇలాంటి ఆపరేషన్ లను ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులపైనా… డాక్టర్లపైనా చర్యలు తీసుకోవడంలో హైదరాబాదులోని వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగితే తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మన అధికారులకు అలవాటు లేకపోవడం విచారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ విషయంలోనూ మన ఇదే చూశాం. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఇటువంటి సంఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *