ఎవరేమనుకుంటారో…? – ఈ ప్రశ్నే విద్యార్థుల ఆత్మహత్యకు కారణం

  • బంధువులు… చుట్టుపక్కల వారే శత్రువులు
  • మార్కుల కోసం మధ్యతరగతి పరుగులు
  • చిన్న వైఫల్యమే పెద్ద విపత్తుగా మారుతోంది
  • 2022లో 2248 మంది విద్యార్థుల ఆత్మహత్య
  • పుట్టే ప్రతి ఒక్కరికీ భూమిపై బతికే హక్కు
  • మార్కుల కోసం మూర్ఖుపు పరుగులు వద్దు
  • మార్కులు, ర్యాంకుల కోసం ప్రాణ త్యాగమా?
  • జాతీయస్థాయిలో విద్యా నిపుణుల ఆందోళన

సహనం వందే, హైదరాబాద్:
పరీక్షా ఫలితాలు వచ్చాయి. యోగిత తన గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. రిలేటివ్స్ ఫోన్ల మోత… కోచింగ్ సెంటర్ల హడావుడి… గుమ్మం బయట తల్లి నిట్టూర్పు… ఇవన్నీ యోగితకు ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ఉన్న యోగిత తెల్లరేసరికి నిర్జీవంగా మారింది. ఇదొక్క యోగిత కథే కాదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యం. మార్కులకు, ర్యాంకులకు ప్రాణం అర్పించే ఎంతోమంది విద్యార్థుల వేదన ఇది. 2022లో మన దేశంలో 1.7 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మూడో వంతు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే ఉండటం భయం గొలిపే విషయం. అంతేకాదు 7.6 శాతం మంది విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఫెయిల్యూర్ భయం చాలా మంది యువత జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని జాతీయ విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కనిపించని శత్రువు…
మధ్యతరగతి ఇళ్లలో ఒత్తిడి అనేది కనిపించని రూపంలో చుట్టుముడుతుంది. పిల్లలు విఫలమవడమే కాదు… సమాజం ముందు విఫలమయ్యారనే భయం వారిని వెంటాడుతుంది. దీనికి ప్రధాన కారణం ‘అందరు ఏమనుకుంటారు?’ అనే ప్రశ్న. ఇదే యువత మనసుల్లో ఒత్తిడి పెంచుతుంది.

ట్యూషన్ల ఫీజులు, కోచింగ్ క్లాసుల ఖర్చులు, భవిష్యత్తుపై బంధువుల గుసగుసలు… ఇవన్నీ కలిసి పిల్లలపై ఒక బండెడు భారాన్ని మోపుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల భద్రత, కుటుంబాన్ని పోషించాలనే ఒత్తిడి, అన్నీ ఒకే పరీక్షా ఫలితంపై ఆధారపడి ఉన్నాయనే భావన యువతలో ఏర్పడుతుంది. ఇది చిన్నపాటి వైఫల్యాన్ని కూడా ఒక పెద్ద విపత్తుగా మార్చివేస్తుంది.

కోటా విషాదాలు… పరీక్షల రణరంగం
ప్రవేశ పరీక్షలలో ఫెయిల్ కారణంగా ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోటా లాంటి కోచింగ్ పట్టణాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 2023లో కోటాలో 26 మంది విద్యార్థులు, 2024లో 17 మంది విద్యార్థులు, అలాగే 2025 మే నాటికి 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. అవమానం, ఒంటరితనం, కుటుంబంలో అకస్మాత్తుగా ఎదురైన ప్రతిఘటనలే ఈ విషాదాలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, భారీగా డబ్బు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో చేర్చినప్పుడు వైఫల్యం అనేది ఆర్థిక, సామాజిక భారాన్ని పెంచుతుంది. 2022లో పరీక్షలలో వైఫల్యం కారణంగా 2,248 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంధువుల అంచనాలూ ఆత్మహత్యలకు దారి
పరీక్షల్లో మార్కులు, సామాజిక అంచనాలే కాకుండా మధ్యతరగతి కుటుంబాల్లోని కొన్ని పరిస్థితులు కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. లైంగిక వేధింపులు, హింస ఎదురైనా కుటుంబానికి చెప్పుకోలేని పరిస్థితి చాలామందిలో ఉంటుంది. అక్రమ గర్భం లాంటి సమస్యలు ఎదురైతే కుటుంబ పరువు పోతుందనే భయంతో సాయం అడగలేరు. ఈ అవమానం, ఒంటరితనం యువత మనసులో ఒక భయంకరమైన సత్యాన్ని నిక్షిప్తం చేస్తాయి. దీంతో వాళ్లు భయం, అయోమయం, సిగ్గు లాంటి భావాలను మనసులోనే దాచుకుంటారు. చివరకు సారీ అమ్మ, సారీ నాన్న అంటూ చిన్నపాటి నోట్ రాసి జీవితాన్ని ముగిస్తారు.

తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లల జీవితాలను కాపాడటానికి కుటుంబంలో చిన్న చిన్న మార్పులు చాలా అవసరం. పిల్లలు తమ సమస్యను బయటపెట్టినప్పుడు వెంటనే తిట్టడం, విమర్శించడం మానేసి వాళ్ల మాటలను వినడం మొదలు పెట్టాలి. కోపాన్ని, నిరుత్సాహాన్ని పక్కన పెట్టాలి. వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి, వృత్తిపరమైన సాయం పొందేలా ప్రోత్సహించాలి. అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పులు, నిరాశగా మాట్లాడటం లాంటి హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలి. ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించినా అవమానమే ప్రధాన ప్రతిబింబంగా ఉన్న ఇళ్లలో ఈ మార్పులు తీసుకురావడం కష్టమే. అయితే జీవితాలను కాపాడాలంటే ఇది తప్పనిసరి.

వ్యవస్థాగత మార్పులు అవసరం…
ఆత్మహత్యల నివారణ అనేది కుటుంబాలకే పరిమితం కాదు. సమాజం, ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాలి. పాఠశాలల్లో పరీక్షా ఫలితాల సమయంలో కౌన్సెలింగ్‌ను సాధారణం చేయాలి. విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం అందించే టెలీ-మానస్ (14416 / 1-800-891-4416) లాంటి హెల్ప్‌లైన్‌ల గురించి ప్రచారం చేయాలి. పరీక్షా సీజన్‌ను కేవలం ఫలితాల గురించి మాత్రమే కాకుండా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టే సమయంగా మార్చాలి. ప్రతి విద్యార్థికి కౌన్సెలింగ్‌ గంటలు తప్పనిసరి చేయాలి. అప్పుడే సంక్షోభంలో ఉన్న విద్యార్థికి సకాలంలో సాయం అందుతుంది. చివరిగా లోగ్ క్యా కహెంగే? అనే భయాన్ని వదిలి, ‘ఆపదలో ఉన్నావా? సహాయం కావాలా?’ అని అడగడం నేర్చుకోవాలి. అప్పుడే యోగిత లాంటి వాళ్ల ప్రాణాలు కాపాడగలం. పుట్టే ప్రతి ఒక్కరికీ భూమిపై బతికే హక్కు ఉందని గమనించాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ స్పేస్ ఉందని మేధావులు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *