- అంతర్జాతీయ వేదికపై అందుకున్న కేశవులు
- ఇస్టా అధ్యక్షుడిగా తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు. అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణం.
విత్తన రంగంలో ఆదర్శం…
తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ, సీడ్ ట్రేసబిలిటీ విధానాలను ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ (ఇస్టా) గుర్తింపు పొందిన తెలంగాణ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తన ఎగుమతులకు మార్గం సుగమం చేసింది. రైతులు, ఉత్పత్తిదారులకు శిక్షణ ఇస్తూ రాష్ట్ర విత్తన రంగానికి గణనీయమైన సహకారం అందిస్తోంది. సంవత్సరానికి సుమారు 22 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణతో పాటు మరో పది రాష్ట్రాలకు ధ్రువీకరించిన విత్తనాలను సరఫరా చేస్తోంది.
ఇస్టా అధ్యక్షుడిగా తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు…
డాక్టర్ కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా కూడా పని చేయడం ద్వారా ప్రపంచ విత్తన రంగంలో దేశ ప్రతిష్ఠను పెంచారు. తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం ఉండటంతో 500కు పైగా విత్తన కంపెనీలు, 3.5 లక్షల మంది రైతులు ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నారు. సుమారు 98 లక్షల టన్నుల విత్తనాలు ఉత్పత్తి అవుతుండగా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.