డాక్టర్‌ రఘురామ్‌ కు గ్లాస్గో కీర్తి కిరీటం

  • తెలుగు బిడ్డకు అరుదైన గౌరవం
  • బ్రిటన్‌ రాయల్‌ కాలేజ్‌ ఫెలోషిప్‌ ప్రదానం
  • నాణ్యమైన వైద్యంలో రఘురామ్‌ పాత్ర భేష్…
  • ఆయన కీర్తి కిరీటంలో మరో మణిపూస…

సహనం వందే, లండన్:
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రొమ్ము క్యాన్సర్‌ శస్త్రవైద్యుడు డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత గ్లాస్గో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (ఆర్‌సీపీఎస్‌జీ) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1997లో ఇదే కాలేజీ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పరీక్షలో అర్హత పొంది ఇప్పుడు గౌరవ ఫెలోషిప్‌ అందుకున్న ఏకైక శస్త్ర వైద్యుడుగా ప్రపంచంలోనే నిలిచారు. గ్లాస్గోలోని చారిత్రక కాలేజీ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హనీ ఎటీబా ఈ గౌరవాన్ని లాంఛనంగా అందజేశారు.

నాణ్యమైన వైద్యంలో రఘురామ్‌ పాత్ర భేష్…
డాక్టర్‌ రఘురామ్‌కు గౌరవ ఫెలోషిప్‌ అందించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రొఫెసర్‌ హనీ ఎటీబా అన్నారు. గత రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి రఘురామ్‌ కొత్త ఆశలు కల్పించారని కొనియాడారు. శస్త్రచికిత్స ప్రమాణాలను పెంచడం, ప్రజారోగ్యం అభివృద్ధి చేయడంలో డాక్టర్‌ రఘురామ్‌ కీలక భాగస్వామి అయ్యారని పేర్కొన్నారు. అలాగే బ్రిటన్‌, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి అనిర్వచనీయమని ప్రశంసించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో డాక్టర్‌ రఘురామ్‌ తెచ్చిన మార్పులు అసాధారణమైనవని గ్లాస్గో రాయల్‌ కాలేజ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అభయ్‌ రేన్‌ కొనియాడారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందినందుకు డాక్టర్‌ రఘురామ్‌ తమ కుటుంబం, రోగులు, తల్లిదండ్రులు, దేశానికి కృతజ్ఞతలు తెలిపారు.

కీర్తి కిరీటంలో మరో మణిపూస…
డాక్టర్‌ రఘురామ్‌కు ఇప్పటివరకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 7 శస్త్రచికిత్స కళాశాలల నుంచి గౌరవ ఫెలోషిప్‌లు లభించాయి. పద్మశ్రీ, డాక్టర్‌ బీసీ రాయ్‌ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన బ్రిటన్‌లోని మూడు శస్త్రచికిత్స రాయల్‌ కాలేజ్‌ల నుంచి, బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి అత్యున్నత గౌరవాలు అందుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బ్రిటిష్‌ సామ్రాజ్యం రెండో అత్యున్నత అవార్డు అయిన బ్రిటిష్‌ ఎంపైర్‌ గౌరవ విధాన అధికారి (2020), రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అత్యున్నత గౌరవం అయిన హానరరీ ఎఫ్‌ఆర్‌సీఎస్‌ (ఇంగ్లాండ్‌ – 2022) కూడా ఆయనకు లభించాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *