హరీష్ రావుకు ముఖ్యమంత్రి యోగం – ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు

  • బీఆర్ఎస్ అంతర్గత పోరు కలిసొచ్చే అంశం
  • కేటీఆర్ కు హరీష్ గట్టి పోటీ ఇస్తారన్న సర్వే
  • కవిత ఎపిసోడ్ కాంగ్రెస్ కే ప్రయోజనం
  • బీసీ ఎజెండా కేవలం రాజకీయ స్వలాభమే
  • కవిత రాజీనామా ఊహించిందేనంటున్న జనం

సహనం వందే, హైదరాబాద్:
ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో 20 పేజీల రిపోర్ట్ చెక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకే మరింత ప్రయోజనం కలిగిస్తుందని సర్వే వెల్లడించింది. సర్వేలో అత్యంత ఆసక్తికరమైన విషయం హరీష్ రావు ప్రజల మనిషిగా ముందుకు వస్తున్నాడని… కేసీఆర్ కుటుంబంలో అంతర్గత యుద్ధం హరీష్ కి లాభిస్తుందని తేలింది. దీంతో హరీష్ రావే భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని చాలామంది నమ్ముతున్నారు.

కేటీఆర్‌కు మించి ప్రజల దగ్గర హరీష్‌కు బలమైన ఇమేజ్ ఏర్పడిందని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ అభిప్రాయం కేవలం హరీష్ వ్యక్తిగత బలం మాత్రమే కాకుండా, కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఆయనకు కలిసివస్తాయని సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి కేటీఆర్‌కు భవిష్యత్తులో హరీష్ రావు నుంచి గట్టి పోటీ వస్తుందని కూడా స్పష్టం చేస్తోంది.

రాజీనామా చుట్టూ రాజకీయాల కుంపటి…
బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. కవిత రాజీనామా కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపునకు సంకేతం. ఫ్లాష్ సర్వేలో వెల్లడైన అంశాలు ఈ పరిణామం బీఆర్‌ఎస్‌కు ఎంత పెద్ద సవాలుగా మారిందో స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ వివాదాల వల్ల పార్టీ ఎంతగా బలహీనపడిందో, ఇతర పార్టీలు ఈ పరిస్థితిని ఎలా సొమ్ము చేసుకుంటున్నాయో సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఊహించని షాకా? ఊహించిన పరిణామమా?
కవిత రాజీనామా వార్త ప్రజలకు పెద్ద షాక్ ఇవ్వలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక శాతం మంది ఇది ముందే ఊహించిన విషయమని చెప్పారు. దీని అర్థం బీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ప్రజలకు కూడా తెలిసిపోయాయి. కేవలం 15 శాతం మందికి మాత్రమే ఇది ఆశ్చర్యం కలిగించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రజలకు ఆమె రాజీనామా వ్యక్తిగత నిర్ణయం కంటే, పార్టీలో అంతర్గత కలహాల సహజ పరిణామంగానే కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌పై తీవ్ర ప్రభావం
కవిత రాజీనామా పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని సర్వేలో వెల్లడైంది. 43 శాతం మంది బీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం నష్టాన్ని కలిగిస్తుందని భావించారు. ఈ అభిప్రాయం కేవలం ఆమె రాజీనామాకు మాత్రమే పరిమితం కాలేదు. హరీష్ రావు, సంతోష్‌లపై ఆమె చేసిన ఆరోపణలు ప్రజల మధ్య గట్టిగా చర్చకు దారితీశాయి. ఇది బీఆర్‌ఎస్ పార్టీలో మరింత చీలికలకు సంకేతం ఇస్తోంది.

సొంత పార్టీ సాధ్యమా?
కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కూడా సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 71 శాతం మంది ఆమె సొంత పార్టీ పెడతారని ఆశిస్తున్నారు. అయితే ఈ కొత్త పార్టీకి మద్దతు లభిస్తుందా అన్న ప్రశ్నకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 31 శాతం మంది మద్దతు ఇస్తామని చెప్పగా, 44 శాతం మంది ఆమె ఎజెండా చూసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆమె సిద్ధాంతాలను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది.

కాంగ్రెస్‌కు లాభం…
కవిత రాజీనామా వల్ల ఏ పార్టీకి ఎక్కువగా ప్రయోజనం చేకూరిందన్న ప్రశ్నకు, 76 శాతం మంది కాంగ్రెస్ పార్టీకే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలోని ఈ అంతర్గత కలహాలు కాంగ్రెస్, బీజేపీలకు అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. కుటుంబ వివాదాల కారణంగా బలహీనపడిన బీఆర్‌ఎస్‌కు ఇది ఒక పెద్ద సవాలు.

లిక్కర్ కేసు, బీసీ ఎజెండా
కవిత రాజకీయ భవిష్యత్తుపై మరో రెండు కీలక అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఉందని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది ఆమె రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద అడ్డంకిగా మారవచ్చు. అదే విధంగా ఆమె బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడటం రాజకీయ స్వలాభం కోసమేనని చాలా మంది భావించారు. బీసీ రిజర్వేషన్లపై ఆమె ప్రజలను నమ్మించలేకపోయిందని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ లేకున్నా కవిత బలమైన నాయకురాలిగా కొనసాగుతారని 25 శాతం మంది భావిస్తున్నారు. 54 శాతం మంది ఆమెకు బలం లేదని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *