న్యూ యా’ఫీల్’ – నేటి రాత్రి 10.30 గంటలకు ఐఫోన్ 17 ఆవిష్కరణ

  • 17 సిరీస్ కోసం యువతరం ఎదురుచూపు
  • యాపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్‌
  • పోర్ట్‌లెస్ డిజైన్, ఈ-సిమ్ సపోర్ట్ ఫీచర్స్
  • ఆరోగ్యానికి పర్యవేక్షకుడిలా యాపిల్ వాచ్
  • హైపర్‌టెన్షన్ హెచ్చరికలను అందిస్తుంది
  • ఎయిర్‌పాడ్స్ ప్రో 3: ఆడియోలో కొత్త శకం
  • యాపిల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో అనుసంధానం

సహనం వందే, అమెరికా:
టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఈవెంట్ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాపిల్ ఈసారి టెక్ ప్రపంచంలో ఏ సంచలనాలు సృష్టిస్తుందో అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

ఐఫోన్ 17 సిరీస్… సన్నగా, శక్తివంతంగా
ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లు రానున్నాయి. ఈసారి ప్లస్ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 17 ఎయిర్‌ను తీసుకురావడం యాపిల్ కొత్త ప్రయోగం. బయటకు లీకైన సమాచారం ప్రకారం… ఐఫోన్ 17 ఎయిర్ కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో యాపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్‌గా రికార్డు సృష్టించనుంది. ఈ ఫోన్‌లో ఏ18 బయోనిక్ చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేకాకుండా పోర్ట్‌లెస్ డిజైన్, ఈ-సిమ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ మోడల్ మరింత ప్రత్యేకంగా నిలవనుంది.

యాపిల్ వాచ్: ఆరోగ్యానికి పర్యవేక్షకుడిలా..
ఈ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ అల్ట్రా 3, సిరీస్ 11, ఎస్ఈ 3లను ఆవిష్కరించనుంది. వాచ్ అల్ట్రా 3లో ఎస్11 చిప్‌తో అధిక రక్తపోటు పర్యవేక్షణ వంటి ఆరోగ్య ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇది హైపర్‌టెన్షన్ హెచ్చరికలను ముందుగానే అందించడంలో సాయపడుతుంది.

సిరీస్ 11లో 5జీ రెడ్‌క్యాప్ సపోర్ట్‌తో కొత్త మీడియాటెక్ మోడెమ్ ఉండొచ్చని అంచనా. ఎస్ఈ 3 మరింత సన్నని బెజెల్స్, వాచ్ ఓఎస్ 26తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా రానుంది. ఈ వాచ్‌ల ధరలు 199 నుంచి 799 డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ఎయిర్‌పాడ్స్ ప్రో 3: ఆడియోలో కొత్త శకం
ఎయిర్‌పాడ్స్ ప్రో 3 హెచ్3 ఆడియో చిప్‌తో మరింత శక్తివంతమైన ఆడియో అనుభవాన్ని అందించనుంది. మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, రియల్-టైమ్ సంభాషణ అనువాదం వంటి ఫీచర్లతో ఈ ఎయిర్‌పాడ్స్ టెక్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి. ఈ మోడల్ ధర సుమారు 249 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. యాపిల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో అనుసంధానం చేస్తూ ఈ ఎయిర్‌పాడ్స్ సంభాషణలను సులభతరం చేయనున్నాయి.

భవిష్యత్ టెక్: విజన్ ప్రో 2, హోమ్‌పాడ్ మినీ 2
యాపిల్ తన మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రో 2ను ఈ ఏడాది చివరిలో విడుదల చేయనుంది. ఎం5 లేదా ఎం4 చిప్‌తో రానున్న ఈ హెడ్‌సెట్ మరింత శక్తివంతమైన అనుభవాన్ని అందించనుంది. అదేవిధంగా హోమ్‌పాడ్ మినీ 2 ఎస్11 చిప్, వై-ఫై 6ఈ లేదా 7 సపోర్ట్‌తో మెరుగైన కనెక్టివిటీని అందించనుంది. దీని ధర సుమారు 99 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. యాపిల్ టీవీ 4కే కూడా ఏ17 ప్రో చిప్‌తో కొత్త అప్‌గ్రేడ్‌లతో రానుంది.

సామ్‌సంగ్‌కు సవాల్‌ విసురుతున్న యాపిల్..
ఐఫోన్ 17 ఎయిర్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌కు గట్టి పోటీనివ్వనుంది. సామ్‌సంగ్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా, 3900 మిల్లీఆంపియర్ అవర్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ యాపిల్ సన్నని డిజైన్, శక్తివంతమైన ఏ18 చిప్‌సెట్‌తో మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ టెక్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించనుందని నిపుణులు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *