- నాలుగేళ్ల పాపని ఇవ్వడానికి నిరాకరణ
- దౌత్య వివాదంగా మారుతున్న వ్యవహారం
- దేశవ్యాప్తంగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం
- ఒక గాయం… అనేక కష్టాలు… కఠిన చట్టాలు
సహనం వందే, న్యూఢిల్లీ:
బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం పాపను అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. విదేశాలలో పిల్లల పెంపకంపై భారతీయులకు సరైన అవగాహన లేకపోవడం, పాశ్చాత్య దేశాల కఠిన చట్టాలు ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒక గాయం.. అనేక కష్టాలు
ఈ దురదృష్టకర సంఘటనకు కారణం ఒక చిన్న ప్రమాదం. గుజరాత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భరత్ షా తన భార్య ధారా షాతో కలిసి 2018లో బెర్లిన్‌కు వెళ్లారు. 2021లో వారికి అరిహా షా జన్మించింది. పాపకు ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో ఆమె జననాంగం వద్ద గాయమైంది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగానే జర్మనీ చట్టాల ప్రకారం అనుమానాస్పద కేసుగా భావించి అధికారులు విచారణ చేపట్టారు. అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానంతో పాపను వారి సంరక్షణలోకి తీసుకుని యూత్ వెల్ఫేర్ ఆఫీసులో ఉంచారు. అప్పటి నుండి పాప తన తల్లిదండ్రులకు దూరంగా ఉంది. కేవలం అప్పుడప్పుడు చూసేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
ప్రభుత్వం పూనుకున్నా ప్రయోజనం శూన్యం…
అరిహా షా బెర్లిన్ అధికారుల అదుపులోకి వెళ్లినప్పటి నుంచి భారతదేశంలో ఆమె తల్లిదండ్రులు, పలు స్వచ్ఛంద సంస్థలు ‘సేవ్ అరిహా’ పేరుతో ఉద్యమం నడిపారు. ఈ విషయంపై అనేకమంది ప్రముఖు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.

దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా జర్మన్ ఛాన్సలర్‌తో మాట్లాడారు. ఫలితంగా అత్యాచార అభియోగాన్ని జర్మనీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రితో సంప్రదించి పాపకు తన భాష, మతం, సంస్కృతి, సమాజంలో పెరిగే హక్కు ఉందని, ఆమెను అప్పగించాలని గట్టిగా కోరారు.
పెంపకంపై హక్కులు రద్దు చేసే యోచన…
అయితే ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బెర్లిన్ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సివిల్ కస్టడీ కేసు దాఖలు చేసి, అరిహా తల్లిదండ్రులకు పాపపై శాశ్వతంగా పెంపకపు హక్కులను రద్దు చేయాలని కోరుతోంది. ఈ తీర్పు కనుక వస్తే పాపను అనాథగా నమోదు చేసి అనాథాశ్రమంలో పెంచుతారు. ఇది పాప తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో వారి వీసా గడువు కూడా ముగియనుండడంతో పాపను చూడడం కూడా కష్టమవుతుంది. ఈ ఘటన విదేశాల్లో నివసించే భారతీయులు అక్కడి పిల్లల పెంపకం చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో మన దేశంలో కూడా పిల్లల పెంపకంలో సున్నితమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన తెలియజేస్తోంది.