కూలీ వేషంలో కాకీ – ముంబై పోలీసుల అనూహ్య వ్యూహం

  • రజినీకాంత్ సినిమాను మరిపించిన పోలీస్
  • ముంబై నుంచి ఇక్కడికి వచ్చి కార్మికుడిగా…
  • రహస్య ఆపరేషన్‌ లో ముంబై కానిస్టేబుల్
  • చర్లపల్లి వేలకోట్ల డ్రగ్స్‌ దందా బట్టబయలు
  • స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై అనుమానాలు

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా నడుస్తున్న ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే రసాయన కర్మాగారం ముసుగులో మెఫడ్రోన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. రజనీకాంత్ సినిమా తరహాలో ఒక కానిస్టేబుల్‌ను కార్మికుడిగా పంపి నెల రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో రూ.12 వేల కోట్ల విలువైన 35,500 లీటర్ల ముడి రసాయనాలు, 5.79 కిలోల మెఫడ్రోన్, 950 కిలోల పొడి పదార్థం, మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశీ మహిళతో దొరికిన కీలక ఆధారం…
ఈ డ్రగ్స్ దందా మూలాలు ముంబైలో వెలుగులోకి వచ్చాయి. గత నెల 8వ తేదీన ఫాతిమా మురాద్ షేక్ అనే బంగ్లాదేశీ మహిళను అరెస్టు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె వద్ద 105 గ్రాముల మెఫడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో డ్రగ్స్ తెలంగాణ నుంచి సరఫరా అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ సమాచారంతో ముంబై నార్కోటిక్ పోలీసులు చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లోని వాగ్దేవి ల్యాబొరేటరీస్‌పై నిఘా పెట్టారు.

పోలీసు కూలీ… మాఫియా విలన్
ముంబై పోలీసుల వ్యూహం అనూహ్యమైంది. డ్రగ్స్ తయారీ గుట్టు తెలుసుకునేందుకు ఒక కానిస్టేబుల్‌ను సాధారణ కూలీ వేషంలో ఫ్యాక్టరీలోకి పంపారు. నెల రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా పనిచేసిన ఆ కానిస్టేబుల్… డ్రగ్స్ తయారీ ప్రక్రియ, వాటి సరఫరా విధానాలపై పక్కా సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు చేరవేశాడు. ఈ కీలక సమాచారంతోనే ముంబై పోలీసులు మెరుపుదాడి చేసి మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారి శ్రీనివాస్ ఉన్నాడు. గతంలోనూ పలుసార్లు పోలీసులకు చిక్కి తన పలుకుబడితో తప్పించుకున్న శ్రీనివాస్ ఈసారి ముంబై పోలీసుల ముందు లొంగిపోక తప్పలేదు.

స్థానిక పోలీసులపైనే అనుమానాలు…
ఈ భారీ డ్రగ్స్ రాకెట్ హైదరాబాద్‌లో ఇంతకాలం యధేచ్ఛగా నడవడం స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోంది. చర్లపల్లి, చెంగిచెర్ల వంటి ప్రాంతాలు డ్రగ్స్ తయారీకి అడ్డాలుగా మారినా స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ఈగల్ బృందాలు గ్రాముల లెక్కన డ్రగ్స్ పట్టుకుంటున్నా ఇంత పెద్ద నెట్‌వర్క్‌పై నిఘా పెట్టకపోవడం స్థానిక పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ కేసులో స్థానిక అధికారుల ప్రమేయంపై లోతైన దర్యాప్తు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *