సహనం వందే, ముంబై:
మహారాష్ట్రలో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో మహారాష్ట్ర తెలుగు మేళవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలోని థానే వెస్ట్ వసంత విహారలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కోటికి పైగా సభ్యత్వం ఉన్న ఈ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ కలిశెట్టి అన్నారు.
విశ్వవ్యాప్తంగా తెలుగు జాతి ఔన్నత్యం…
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా సంఘాలుగా ఏర్పడి తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం అభినందనీయమని కలిశెట్టి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రపంచానికి తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగువారి ప్రతిష్టను పరిచయం చేసిన ఎన్టీఆర్‌ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే తెలుగు భాష పరిరక్షణకు, తెలుగువారి సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణలు, చర్యలు ప్రశంసనీయమన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో ముందుకు…
ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర వేదికగా తెలుగు ప్రజల తరఫున ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతూ… వారి సారథ్యంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడం తనకు స్ఫూర్తినిస్తోందని కలిశెట్టి అన్నారు. ప్రపంచంలోని తెలుగు సంఘాల కార్యక్రమాలకు హాజరవడం తనకు సంతోషాన్నిస్తుందని, తెలుగు జాతి గొప్పతనాన్ని, సృజనాత్మకతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం తన బాధ్యతని ఆయన తెలియజేశారు.