- బీసీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా?
- షర్మిల ఎలాగో… కవిత పరిస్థితి అలాగే!
- ఆస్తులు, అంతస్తులు, పదవులు ఇవే ఎజెండా
- మొదట్లో అన్న టార్గెట్... ఇప్పుడు హరీష్ పైనే
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలు ఈ విషయాలపై పునరాలోచించాలని ఆమె కోరారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కు భావోద్వేగభరిత విజ్ఞప్తి చేశారు.
కుటుంబ తగాదాలతో రాజకీయమా?
కుటుంబ తగాదాలు రాజకీయ ఎజెండాగా సక్సెస్ అవుతాయా అన్నది ప్రశ్నగా మారింది. అంతర్గత కుటుంబ ఘర్షణలను బీసీ ఉద్యమానికి లింక్ పెడితే ఆ వర్గాలు ఏ మేరకు నమ్ముతాయన్నది సందేహంగా ఉంది. అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి బీసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తే ప్రజలు నమ్మే అవకాశం తక్కువని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె పార్టీపై విమర్శలు చేయడం, ఈ ఆవేదన ప్రజలకు సంబంధించినది కాదని, కేవలం నీటి బుడగలుగానే మిగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆస్తులు, పదవులు వీటికి సంబంధించిన అంతర్గత గొడవలే కవిత బయటకు రావడానికి ప్రధాన కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయమే రాష్ట్ర ప్రజల అన్యాయంగా ఆమె చెప్పటాన్ని జనం స్వీకరించే పరిస్థితుల్లో లేరు.
కవిత… షర్మిల మధ్య రాజకీయ పోలిక
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల మధ్య జరిగిన విభేదాలు కూడా ప్రధానంగా ఆస్తుల వివాదంగానే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల వైసీపీ కోసం శ్రమించినా, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విభేదాలకు ఆస్తుల పంపకాలు, పార్టీలో అధికార పంపకాలు ప్రధాన కారణాలయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. వీరి మధ్య అధికారం, ఆస్తుల కొట్లాట తప్ప అంతకుమించి ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. కవిత రాజకీయ భవిష్యత్తు కూడా షర్మిల లెక్కనే అవుతుందని కూడా కొందరు అంటున్నారు. షర్మిల మొదట్లో తెలంగాణలో పార్టీ పెట్టి చివరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్, హరీశ్ రావులపై కవిత సంచలనం
పార్టీలో అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకే విమానంలో ప్రయాణించిన తర్వాతే తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర మొదలైందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని, బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని, ట్రబుల్ క్రియేటర్ అని తీవ్రంగా విమర్శించారు. జగ్గారెడ్డి, రఘునందన్ రావు, విజయశాంతి, ఈటెల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు హరీశ్ రావు వల్లే పార్టీకి దూరమయ్యారని, దుబ్బాక ఓటమికి కూడా హరీశ్ రావే కారణమని ఆరోపించారు.
అన్నకు అభ్యర్థన… తండ్రికి హెచ్చరిక
తొలుత అన్న కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్న కవిత… ఇప్పుడు హరీశ్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. వారిని పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందని, లేకపోతే కేటీఆర్ కు కూడా తన పరిస్థితే ఎదురవుతుందని ఆమె హెచ్చరించారు. తన తండ్రి చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోమని కేసీఆర్‌ను కోరారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఆయన లాంటి తండ్రి దొరుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆక్రోశం ప్రజలకు సంబంధించినది కాదని, అది కేవలం రాజకీయ నీటి బుడగ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న వివాదాలను రోడ్డు మీదికి తీసుకురావడంలో మాత్రమే ఆమె సక్సెస్ అయ్యారని, అంతకుమించి ఆమెకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.