అగ్రరాజ్యంగా చైనా – నాటి రష్యా పాత్రను పోషిస్తున్న డ్రాగన్ కంట్రీ

  • అమెరికాకు చెక్ పెడుతున్న కమ్యూనిస్టు దేశం
  • భారత్, రష్యా, ఉత్తర కొరియాలతో సఖ్యత
  • యూఎస్ ని ఎదుర్కొనేందుకు ఐక్యత ప్రదర్శన
  • సైనిక కవాతుతో తన శక్తిని ప్రదర్శించిన చైనా
  • 20 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే క్షిపణి
  • భూగోళంపై శత్రువు ఎక్కడున్నా దీంతో దాడి

సహనం వందే, చైనా:
ఒకప్పుడు కమ్యూనిస్ట్ రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రపంచానికి అండగా నిలబడింది. ఇప్పుడు అదే బాధ్యతను కమ్యూనిస్ట్ చైనా భుజానికెత్తుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాపై విమర్శల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికా విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ సుంకాల విధానాల వల్ల అనేక దేశాలు నష్టపోతున్నాయి. చైనా, భారత్‌ వంటి దేశాలను లెక్కచేయకుండా సుంకాలు విధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంపై షీ పదే పదే ప్రశ్నిస్తున్నారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా, భారత్‌ వంటి అనేక దేశాలను ఒక తాటిపైకి తీసుకొస్తూ ఏకధ్రువ ప్రపంచాన్ని సవాల్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు చైనాకు వ్యతిరేకంగా ఉన్న భారత్ కూడా ఇప్పుడు ఆ దేశంతో సంబంధాలు కోరుకుంటుంది.

బీజింగ్‌ పరేడ్‌లో రాకాసి అణు క్షిపణి…
ప్రపంచానికి తన సత్తాను, శక్తిని చూపించడానికే మంగళవారం చైనాలో సైనిక కవాతు నిర్వహించింది. చైనా తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణు క్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. దీనిని డీఎఫ్‌-5సీగా వ్యవహరిస్తున్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజిలోకి భూగోళం మొత్తం వస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఇది ధ్వంసం చేయగలదు.

అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్లగలదని చెబుతున్నారు. ఈ క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనిని మూడు భాగాలుగా తరలించి ఆ తర్వాత అసెంబ్లింగ్‌ చేసి ప్రయోగిస్తారు. డీఎఫ్‌-5సీని భారీ సిలోస్‌ నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీని రేంజి 20 వేల కిలోమీటర్లకు పైగానే. దీంతో చైనా ప్రతి దాడి సమయంలో శత్రువు ఎక్కడా అందకుండా దాక్కొనే అవకాశమే ఉండదు. శత్రుదేశంలోని భూగర్భ స్థావరాలను కూడా ఛేదించగలదు.

అత్యంత వేగంగా… అత్యంత కచ్చితత్వంతో
ఈ భారీ అణు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి దాడి సమయంలో ధ్వని కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించగలదు. దీంతో ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలకు దీనిని ఎదుర్కోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. డీఎఫ్‌-5సీలో ఎంఐఆర్‌వీను వాడారు. అంటే ఏకకాలంలో పలు అణు, సంప్రదాయ వార్‌హెడ్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డెకాయ్‌లను ఇది మోసుకెళ్లగలదు. వేర్వేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా పది వార్‌ హెడ్‌లను తీసుకెళ్లగలదని అంచనా వేస్తున్నారు. చైనా అభివృద్ధి చేసిన బైడూ నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు. 20 వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగినా, షార్ట్‌ మిసైల్స్ వలే అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా చెబుతోంది.

తొలిసారి ప్రదర్శించిన అస్త్రాలు…
చైనా తొలిసారి ఎల్‌వై-1 లేజర్‌ వ్యవస్థను ప్రదర్శించింది. దీనిని ట్రక్కుపై అమర్చి పరేడ్‌కు తీసుకొచ్చారు. వీటితోపాటు హైపవర్డ్‌ మైక్రోవేవ్‌ వ్యవస్థలను కూడా ప్రదర్శించింది. న్యూ జనరేషన్‌ టైప్‌-100 ట్యాంక్‌లను ప్రదర్శించింది. వీటిని హైలీ ఇంటెలిజెంట్‌ ట్యాంక్‌గా అభివర్ణించింది. డాంగ్‌ఫెంగ్‌-61 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించింది. దీని రేంజి 12 వేల కిలోమీటర్లుగా వెల్లడించింది. గగనతలం నుంచి ప్రయోగించే అణు క్షిపణి జేఎల్‌-1ను ఈ సారి పరేడ్‌లో తొలిసారిగా ప్రపంచం ముందుకు తెచ్చింది. దీంతో చైనా న్యూక్లియర్‌ ట్రైయాడ్‌ను ఇది బలోపేతం చేసినట్లైంది. ఏజేఎక్స్002 భారీ సముద్ర డ్రోన్‌ను ఈ సారి పరేడ్‌కు తీసుకొచ్చింది. కృత్రిమ మేధ సాయంతో దాడి చేసే డ్రోన్లను కూడా ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలన్నీ అమెరికా ఆధిపత్యానికి చైనా ఇస్తున్న బలమైన సవాల్‌గా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *