- జీవశాస్త్ర సాంకేతికతతో మృత్యువుపై పట్టు
- చావుకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీపై చూపు
- ముందు 150 ఏళ్లు బతికే అవకాశాలపై చర్చ
- వారి ఆలోచనపై నివ్వెర పోతున్న ప్రపంచం
సహనం వందే, చైనా:
చైనాలో చారిత్రక తియాన్మెన్ చౌక్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఓ రహస్య సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీరు ఇప్పటికే అనేక వ్యూహాలు రచిస్తుంటారు. అయితే ఈసారి వీరి సంభాషణ చావును జయించి శాశ్వతంగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై జరిగినట్లు సీక్రెట్ చర్చ బయటపడింది. జీవశాస్త్ర సాంకేతికతతో అవయవ మార్పిడి ద్వారా మానవ జీవిత కాలాన్ని పెంచడం, బహుశా అమరత్వం కూడా సాధ్యమని వీరు చర్చించుకున్నట్లు చైనా జాతీయ టీవీ ప్రత్యక్ష ప్రసారంలో రికార్డైంది. వీరితో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా ఉన్నారు. (బీబీసీలో వచ్చిన వార్త https://bbc.in/4n6biAO ఆధారంగా రాసిన కథనం ఇది. )
అధికార దాహం… జీవితంపై ఆశ
జి జిన్‌పింగ్ 13 సంవత్సరాలుగా, పుతిన్ 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలన సాగిస్తున్న ఈ నేతలు అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని ఈ చర్చలు స్పష్టం చేశాయి. జీవిత కాలాన్ని పొడిగించుకునే మార్గాలపై వారు చర్చించుకోవడం, వారిలో అధికార దాహం ఎంత బలంగా ఉందో తెలుపుతోంది. జి జిన్‌పింగ్ మాట్లాడుతూ గతంలో 70 ఏళ్లు దాటడం అరుదుగా ఉండేదని, కానీ ఇప్పుడు 70 వచ్చినా బాల్యంలా ఉంటుందని అన్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ… పుతిన్ అవయవ మార్పిడి వంటి ఆధునిక వైద్య పద్ధతులు మానవ జీవిత కాలాన్ని పొడిగిస్తాయని… అమరత్వం కూడా సాధ్యమని పేర్కొన్నారు. ఈ శతాబ్దంలో మనిషి 150 ఏళ్లు జీవించే అవకాశం ఉందని జి జోక్యం చేసుకున్నారు.
అమరత్వం కోసం పరుగులు
పుతిన్ తన వ్యాఖ్యలను రష్యన్ మీడియాతో మరోసారి పంచుకున్నారు. ఆధునిక వైద్యం, ముఖ్యంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మానవ జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుతాయని ఆయన అన్నారు. ఈ చర్చ కేవలం వారి వ్యక్తిగత ఆసక్తిని మాత్రమే కాదు ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అగ్రనేతలు అమరత్వం గురించి చర్చించుకోవడం, భవిష్యత్తులో సాంకేతిక పురోగతితో కూడిన ప్రపంచం ఎలా ఉంటుందో సూచిస్తోంది. అయితే వారి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రపంచ శాంతికి, శక్తుల సమతుల్యతకు సంబంధించిన అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. మనిషికి చావును జయించే అవకాశం వస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించాల్సిన విషయం.