- బొబ్బిలికి కొత్త బ్రిడ్జిలు కావాలని డిమాండ్
- కొత్త రైళ్లు… స్టాప్‌ల కోసం ప్రత్యేక విన్నపం
- పెండింగ్ పనులపై వేగం పెంచాలని విజ్ఞప్తి
- భువనేశ్వర్ లో ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశం
సహనం వందే, భువనేశ్వర్:
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో ఆయన మాట్లాడారు.
బొబ్బిలికి కొత్త బ్రిడ్జిలు కావాలి…
బొబ్బిలి పట్టణంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పొడిగించాలని, రోడ్డు రద్దీని తగ్గించేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జిని మరింత బలోపేతం చేయాలని ఎంపీ కోరారు. అలాగే బొబ్బిలి రైల్వే కాలనీ ప్రజల కోసం స్టేషన్‌కు, పట్టణానికి మధ్య వికెట్ గేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే కాంపౌండ్ గోడపై ఈ గేట్ నిర్మిస్తే ప్రజల రాకపోకలు సురక్షితంగా ఉంటాయని తెలిపారు.

డోంకినివలసలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని విస్తరించాలి
డోంకినివలసలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని విస్తరించాలని అప్పలనాయుడు అధికారులకు సూచించారు. లెవల్ క్రాసింగ్‌ల వద్ద వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో వేచి ఉండే సమయం తగ్గించడానికి ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు. మల్లంపేట గ్రామాన్ని బొబ్బిలితో కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అత్యంత కీలకమని ఎంపీ ఉద్ఘాటించారు. గతంలో రైల్వే స్టేషన్ పునరుద్ధరణ సమయంలో ఈ బ్రిడ్జిని కూల్చివేయడంతో సుమారు 30,000 మంది నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువపై కల్వర్టు నిర్మాణం కోసం రైల్వే భూమిపై నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు.
కొత్త రైళ్లు… స్టాప్‌ల డిమాండ్
ప్రయాణికుల సౌకర్యార్థం పలు కొత్త రైళ్లు, స్టేషన్లలో ఆగుతున్న రైళ్లకు అదనపు స్టాప్‌లు ఏర్పాటు చేయాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. కోణార్క్, ఫలక్‌నుమా, యశ్వంతపూర్, బిబిఎస్, టిపిటివై ఎక్స్‌ప్రెస్‌లకు చీపురుపల్లిలో, బ్రహ్మంపూర్ ఇంటర్‌సిటీ, తిరుమల, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లకు సిగడంలో ఆగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే విజయనగరంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు, సిగడం స్టేషన్‌లో మూడవ ప్లాట్‌ఫాం నుంచి నాల్గవ ప్లాట్‌ఫాం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పొడిగించాలని కోరారు. భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి రెండు రోజులకు బదులుగా రోజువారీ రైలుగా మార్చాలని అభ్యర్థించారు.
ఆధునిక సౌకర్యాలు తప్పనిసరి
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని ఎంపీ అధికారులకు సూచించారు. వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, తాగునీరు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఈ ఆధునిక సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
బొబ్బిలి స్టేషన్‌లో సరుకు రవాణా రైళ్ల లోడింగ్, అన్‌లోడింగ్‌ను కోమటిపల్లి లేదా సీతానగరం స్టేషన్‌లకు మార్చాలని సూచించారు. అలాగే దిగువ, మధ్య తరగతి ప్రయాణికులకు ఉపయోగపడేలా భువనేశ్వర్ నుంచి బయలుదేరే రైళ్లకు అదనపు స్లీపర్ కోచ్‌లు జోడించాలని కోరారు.
పెండింగ్ పనులపై వేగం పెంచండి
రాయగడ, పార్వతీపురం మధ్య లెవల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జిలు లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. చీపురుపల్లి-రాజాం రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గరివిడి, చీపురుపల్లిని కలిపే కె.ఎల్.పురం గ్రామం వద్ద లెవల్ క్రాసింగ్ మూసివేతపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఆమోదించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కొత్త రైలు మార్గాలు, ఉన్న రైళ్ల విస్తరణ అవసరమని అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో అప్పలనాయుడు సమగ్ర నివేదికలతో సమస్యలను వివరించి, పరిష్కార మార్గాలను సూచించారు.