- సంక్షేమం ముసుగులో నిఘా అస్త్రం
- సమాచార సేకరణ… మళ్లీ మొదలైన నిఘా
- జగన్ సర్వే… బాబు కార్డు రెండూ ఒకటేనా?
- సైబర్ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో సందేహాలు
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల మంటలు ఇంకా ఆరలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారని… ఫ్యామిలీ కార్డు పేరుతో సమాచార దోపిడీకి మరో రూపం ఇస్తున్నారని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇది నిజంగా సంక్షేమం కోసమా? లేక రాజకీయ అస్త్రమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
జగన్ ప్రభుత్వ హయాంలో…
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి సర్వేల పేరుతో వాలంటీర్లు సేకరించిన సమాచారం తీవ్ర విమర్శలకు గురైంది. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారి ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల వివరాలు సేకరించారని… ఆ డేటాను ఎన్నికల సమయంలో ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సమాచార సేకరణ ఓటర్లను ప్రభావితం చేయడంలో ఒక కీలక అస్త్రంగా మారిందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఫ్యామిలీ కార్డుల ద్వారా అదే తరహాలో సమాచారం సేకరించాలని చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆదాయం, సంక్షేమ పథకాల సమాచారం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా… ఈ డేటా భవిష్యత్తులో రాజకీయ దుర్వినియోగానికి గురి కాదన్న హామీ ఎక్కడా లేదు. పాలకుల చేతిలో ఈ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు సురక్షితం అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఆధార్‌ను మించి నిఘా వ్యవస్థ…
ఫ్యామిలీ కార్డును ఆధార్ తరహాలో ఒక సమగ్ర వ్యవస్థగా మార్చాలని చంద్రబాబు సూచించారు. కుటుంబ సమాచారం, పథకాల వివరాలు, ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఇది ఒక విధంగా ఆధార్‌ను మించిన మెగా డేటాబేస్ వ్యవస్థగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ వ్యవస్థపైనే గతంలో గోప్యత ఉల్లంఘన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంత విస్తృతమైన సమాచారాన్ని సేకరించి నిల్వ చేయడం ఎంతవరకు సురక్షితం? సైబర్ దాడులు, సమాచార దుర్వినియోగం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ డేటాబేస్ రాజకీయ శక్తుల చేతిలో ఒక శక్తివంతమైన నిఘా సాధనంగా మారే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ లబ్ధికి డేటా ఆయుధం…
ఫ్యామిలీ కార్డుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం రాజకీయ లబ్ధి పొందడమేనని అంటున్నారు. ఈ సున్నితమైన సమాచారం ఎన్నికల సమయంలో ఏ వర్గానికి చెందిన ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఫ్యామిలీ కార్డుల వ్యవస్థను అమలు చేయడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటోందో, ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యతకు ఎలాంటి హామీ ఇస్తుందో స్పష్టంగా చెప్పలేదు. సమాచార గోప్యతకు సంబంధించిన చట్టాలు, డేటా రక్షణ విధానాల గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. గతంలో జరిగిన సమాచార దుర్వినియోగంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా తొలగిస్తుందనేది పెద్ద సవాల్.