సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

  • రైళ్ళను అంతా సులువుగా ఆపడమే విచిత్రం
  • నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
  • మహిళ మెడలోని 68 తులాల బంగారం చోరీ

సహనం వందే, గుంటూరు:
దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35 నిమిషాలపాటు నిలిపివేశారు. ఈ అవకాశాన్ని దొంగలు సద్వినియోగం చేసుకున్నారు.

బోగీల్లో చొరబడి దోపిడీ…
రైలు ఆగిన వెంటనే దొంగల ముఠా ఎస్‌ 1, ఎస్‌ 3 బోగీల్లోకి చొరబడింది. నిద్రలో ఉన్న ప్రయాణికురాలు విజయవాడకు చెందిన శ్రీదేవి మెడలోని 68 తులాల బంగారు గొలుసును లాగేసి పరారయ్యారు. మరో మహిళ వద్ద రోల్డ్ గోల్డ్ గొలుసును కూడా దోచుకున్నారు. ఎస్‌ 5 బోగీలో చోరీకి యత్నించగా ప్రయాణికులు శబ్దాలు విని కేకలు వేయడంతో దొంగలు పరుగులు తీశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు భద్రతా సిబ్బంది లేకపోవడం ఈ దోపిడీకి కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిగ్నల్ ట్యాంపరింగ్ ఎలా చేస్తారు?
రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేయడానికి దొంగలు జంక్షన్ బాక్స్‌లోని తీగలను కత్తిరించడం లేదా షార్ట్ సర్క్యూట్ చేయడం వంటి పద్ధతులు అనుసరిస్తారు. సిగ్నల్ బాక్స్‌లోని సర్క్యూట్ బోర్డును ధ్వంసం చేస్తారు. దీంతో రెడ్ సిగ్నల్ పడుతుంది లేదా సిగ్నల్ అసలు కనిపించకుండా చేస్తారు. ఫలితంగా లోకో పైలట్ రైలును ఆపక తప్పదు. కొన్నిసార్లు సిగ్నల్ లైటుపై వస్త్రం చుట్టి లోకో పైలట్‌కు సిగ్నల్ కనిపించకుండా చేస్తారు. ఈ గ్యాప్‌లో దొంగలు రైలు బోగీల్లోకి చొరబడి దోపిడీకి పాల్పడతారు. ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమని, రైలు ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుస దొంగతనాలతో ఆందోళన
సోమవారం హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇలాంటి చోరీ జరిగింది. న్యూ పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి రైల్వే స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. శ్రీదేవి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రిమినల్ ముఠాలు ఈ దొంగతనాల వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే శాఖ భద్రతా చర్యలను మరింత కట్టడి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భద్రతా సిబ్బంది లేకపోవడం ఈ ఘటనకు దారితీసిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వే శాఖ గస్తీ సిబ్బందిని పెంచి సిగ్నల్ వ్యవస్థల భద్రతను కాపాడే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటే రైల్వే పోలీసులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *