అపార్ట్‌మెంట్లు డ్రగ్స్ అడ్డాలు – పబ్‌, రిసార్ట్‌, ఫామ్‌హౌస్‌లపై నిఘాతో మార్పు

  • మహానగరంలో కొత్త చీకటి సామ్రాజ్యాలు
  • సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లే కేంద్రాలు
  • రేవ్ పార్టీలు మొదలు వ్యభిచారం వరకూ…

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరంలో అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లలో చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన నేరగాళ్లు… ఇప్పుడు తమ కార్యకలాపాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసుల నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుని అక్కడే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల కొండాపూర్‌లో జరిగిన సంఘటన ఈ ప్రమాదకరమైన పోకడకు అద్దం పట్టింది. పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేయగా వారి నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు నగరంలో చాలా చోట్ల జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకునేవారు అపరిచితులు కావడంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అపార్ట్‌మెంట్ యాజమాన్యాలకు కూడా కష్టం అవుతోంది.

పోలీసులకు కొత్త సవాల్…
పబ్‌లు, రిసార్ట్‌లపై నిఘా పెంచడం, తరచూ తనిఖీలు చేపట్టడం వల్ల నేరగాళ్ళు ఆ ప్రాంతాలను విడిచిపెట్టారు. పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలకు ప్రతివ్యూహంగా అజ్ఞాత ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లు కొన్ని రోజులకు లేదా కొన్ని గంటలకూ అద్దెకు లభించడమే వారికి కలిసి వస్తుంది. ఇవి గోప్యతను కోరుకునే వారికి, తాత్కాలికంగా ఆశ్రయం వెతుక్కునే వారికి అనుకూలంగా మారాయి. నేరస్థులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పోలీసుల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాంటీ నార్కోటిక్స్ విభాగం, ప్రత్యేక బృందాలు ఈ సర్వీస్ అపార్ట్‌మెంట్లపై నిఘా పెంచినా నగరంలో ఉన్న వేలాది అపార్ట్‌మెంట్లలో నేరాలు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించడం వారికి సవాలుగా మారింది.

నిబంధన ఉల్లంఘన… యజమానుల నిర్లక్ష్యం
సర్వీస్ అపార్ట్‌మెంట్లను నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. అద్దెకు తీసుకునే వారి గుర్తింపు పత్రాలు, పూర్తి వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలని, అపార్ట్‌మెంట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ చాలా మంది యజమానులు కేవలం డబ్బు కోసం ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నేరగాళ్లు దీనిని ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని తెలిసినా లేదా అనుమానం ఉన్నా అపార్ట్‌మెంట్లను అద్దెకు ఇచ్చే యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. అటువంటి సందర్భాలలో డ్రగ్స్ కేసులలో నిందితులతో పాటు అపార్ట్‌మెంట్ యజమానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నిర్లక్ష్యం వల్ల సమాజానికి చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సామాజిక భద్రతకు ముప్పు…
సర్వీస్ అపార్ట్‌మెంట్లలో జరుగుతున్న నేరాలు సమాజ భద్రతకు పెను ముప్పుగా మారాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలు కేవలం డ్రగ్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా వ్యభిచారం, అక్రమ కార్యకలాపాలకు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. యువత ఈ నేరాలకు సులభంగా బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కార్యకలాపాలు చుట్టుపక్కల నివసించే ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ సమస్యను అరికట్టడానికి పోలీసులు, యజమానులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *