సహనం వందే, కోచి:
సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్ పై కిడ్నాప్, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు మాత్రమే పరిమితమైన చీకటి కోణాలు, ఇప్పుడు వెండితెర వెనుక కూడా వెలుగు చూశాయని ఈ ఘటన నిరూపించింది.
అసలు కథ.. ఎవరిది ఈ వివాదం?
బాధితుడైన ఐటీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు ప్రకారం… నటి లక్ష్మీ మీనన్‌తో సహా నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణం గత వారమే జరిగిందని, తీవ్ర గాయాలతో బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా వ్యక్తిగత వివాదాలే ఈ ఘటనకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణకు పిలిచే అవకాశం…
ఒకప్పుడు వినోదం పంచిన తార, ఇప్పుడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నమ్మశక్యంగా లేకపోయినా, ఫిర్యాదులోని అంశాలు మాత్రం కేసు తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి లక్ష్మీ మీనన్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో ఆదర్శప్రాయమైన పాత్రలు పోషించిన నటి, నిజ జీవితంలో ఇలాంటి నేరంలో ఇరుక్కోవడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు.