కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

  • సారా, కోలిన్ దంపతులకు చీకటి రాత్రులు
  • దాగిన రహస్యం… బయటపడిన నిజం
  • వెనుకా ముందు చూసుకుని ఇల్లు కొనండి
  • వీరి గుణపాఠం మనకు చెబుతున్న పాఠం అదే

సహనం వందే, అమెరికా:
ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. సాధారణ జలుబుతో మొదలై దద్దుర్లు, కళ్ల చుట్టూ దురద, చివరికి చర్మం పగిలి రక్తం కారడం వంటి తీవ్రమైన సమస్యలుగా మారాయి. ఆ ఇంటిలో ఏదో దాగి ఉందని ఆమెకు అనుమానం కలిగింది.

దాగిన రహస్యం… బయటపడిన నిజం
తన అనారోగ్య సమస్యలను సారా సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్లు ఇంటిని పరిశీలించాలని సలహా ఇచ్చారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణుడి సహాయంతో ఇంటిని తనిఖీ చేయగా గోడలు, కార్పెట్లలో నీటి లీకేజీల వల్ల భారీగా బూజు పేరుకుపోయినట్లు తేలింది. ఇంటిలోని ప్రతి మూలనా బూజు వ్యాపించి ఉందని, అది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు నిర్ధారించారు. ఇంట్లో బూజు కనపడకుండా ఉండటానికి పైకప్పుకు తెలుపు రంగు పూసినట్లు కూడా గుర్తించారు. ఈ విషయం తెలియడంతో ఆ దంపతులు పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కలల ఇల్లు ఒక నరక కూపంగా మారిందనే నిజం వారిని కుంగదీసింది.

ఆర్థిక, మానసిక భారం
బూజు సమస్యను పరిష్కరించడానికి సారా, కోలిన్ దంపతులు సుమారు రూ. 8.3 లక్షలు ఖర్చు చేశారు. వైద్య పరీక్షలు, చికిత్సలు, ఇంటిని శుభ్రపరచడం కోసం ఈ మొత్తం వ్యయం అయ్యింది. ఇన్సూరెన్స్ సంస్థ సాయం అందించకపోవడంతో ఆర్థిక భారం మరింత పెరిగింది. బూజు కారణంగా వారి 90 శాతం వస్తువులను పారవేయాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం మరింత దిగజారడంతో సారా తన తల్లిదండ్రులు, అత్తమామల ఇంటికి మారాల్సి వచ్చింది. ఈ మొత్తం సంఘటన వారిని శారీరకంగానే కాక మానసికంగానూ కృంగదీసింది.

న్యాయ పోరాటం… గుణపాఠం
సారా కష్టాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు స్పందించారు. ఆన్‌లైన్ నిధి సేకరణ ద్వారా దాదాపు రూ. 4.38 లక్షలు సేకరించి వారికి అండగా నిలిచారు. ఈ దంపతులు బూజు సమస్యను దాచిపెట్టిన ఇంటి యజమానిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కలలుగన్న ఇల్లు కన్నీటిని మిగల్చడంతో ఈ సంఘటన ఇంటి కొనుగోలుదారులకు ఒక పెద్ద గుణపాఠంలా నిలుస్తోంది. ఒక ఇంటిని కొనుగోలు చేసే ముందు అన్ని రకాల పరిశీలనలు జరపడం, గోడలు, పైకప్పు వంటి వాటిని నిపుణులతో తనిఖీ చేయించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *