- ‘నువ్వు చస్తే నీ పెళ్ళాం నీతో మంటల్లో తగలబడుతుందా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు
- సనాతన ధర్మం గురించి చెప్తున్నప్పుడు వీటిని పాటిస్తావా అంటూ నిలదీత
- మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు…
సహనం వందే ఒంగోలు:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్‌పై నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మంలో భాగమేనా అని ప్రశ్నించడమే కాకుండా… విడాకులిచ్చిన భార్యలు, ఇప్పుడు ఉన్న భార్య గురించి కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ తాను సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని దానితో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని నారాయణ నిలదీశారు.
సతీ సహగమనంపై…
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శల పరంపరను కొనసాగిస్తూ నారాయణ సతీ సహగమనం గురించి ప్రశ్నించారు. ‘నువ్వు చస్తే నీ భార్య నీతో మంటల్లో తగలబడుతుందా?’ అని ఘాటైన పదజాలంతో స్థాయిని మరిచి వ్యాఖ్యానించారు. బ్రిటిష్ ప్రభుత్వమే రద్దు చేసిన ఈ చట్టాన్ని ఉదాహరణగా చూపి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తన స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘జంతువుకైనా ఒక పాలసీ ఉంటుంది, నీకు అది కూడా లేదు’ అని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని తెప్పించాయి. మీడియాలో ఈ వివాదం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఏ స్థాయికి దిగజారాయో మరోసారి స్పష్టమైంది.
పవన్ ఒక బఫూన్ అంటూ…
పవన్ కళ్యాణ్‌ను పూటకో మాట మార్చే ఊసరవెల్లిగా నారాయణ అభివర్ణించారు. ఉదయం చెగువేరా అంటూ, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటూఉంటాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక బఫూన్ అని తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్వార్థ రాజకీయాల కోసం ఎన్డీఏ కూటమిలో చేరారని, గతంలో బీజేపీ చేతిలో దెబ్బతిన్న చంద్రబాబు మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.