- కృత్రిమ మేధతో మానసిక వ్యధ
- ఏఐ పితామహుడు జాఫ్రీ హింటన్ హెచ్చరిక
- అణుబాంబులా మానవాళి వినాశనం?
సహనం వందే, అమెరికా:
కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.

భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…
ఒకప్పుడు గూగుల్‌లో పనిచేసిన జాఫ్రీ హింటన్ ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెక్ దిగ్గజాలు లాభాల కోసం ఏఐ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయని విమర్శించారు. షేర్‌హోల్డర్ల ఒత్తిడి కారణంగా ఈ సంస్థలు నీతి, భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నాయని ఆయన అన్నారు. ఏఐ వ్యవస్థలు మానవ నియంత్రణను అధిగమించే ప్రమాదం ఉందని… తప్పుడు సమాచారం లేదా ఉద్యోగాల నష్టంతో ఈ ముప్పు ఆగదని… మానవాళి మనుగడకే పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మానవుల కంటే తెలివిగా మారితే ప్రమాదం…
ఏఐ విప్లవం కోసం ప్రపంచం సిద్ధంగా లేదని హింటన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, పరిశోధకులు ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసి, భద్రతా చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఒకవేళ ఏఐ మానవుల కంటే తెలివిగా మారితే అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలు లేకుండా ఏఐ అభివృద్ధి చెందితే దాని పరిణామాలు వినాశకరంగా ఉంటాయని ఆయన అన్నారు.
ఇతర ప్రముఖుల్లోనూ ఆందోళన...
జాఫ్రీ హింటన్ ఒక్కరే కాదు… మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ వంటి ఇతర నిపుణులు కూడా ఏఐ వల్ల కలిగే ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో అతిగా సంభాషణలు జరిపే వ్యక్తులు మానసికంగా భ్రమలకు లోనయ్యే అవకాశం ఉందని, ఈ సమస్యను ‘ఏఐ సైకోసిస్’ అని ఆయన పిలిచారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వ్యక్తులు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువని ఆయన హెచ్చరించారు.
నియంత్రణ ఒక్కటే మార్గం…
జాఫ్రీ హింటన్ ప్రభుత్వాలను, నియంత్రణ సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఏఐ అభివృద్ధికి స్పష్టమైన నియమాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ఏఐని అణ్వాయుధాల మాదిరిగా ఒక ఆయుధంగా చూడకుండా, దానిని మానవాళి సంక్షేమానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అనియంత్రిత ఏఐ అభివృద్ధి కొనసాగితే, అది అణ్వాయుధాల పోటీతో సమానమైన విధ్వంసాన్ని తెచ్చే అవకాశం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఏఐ భవిష్యత్తు మానవాళి చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.