- కొందరు అధికారుల అండదండలు
- కొరతకు మరింత కొరత సృష్టిస్తున్న దుస్థితి
సహనం వందే, హైదరాబాద్:
యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంటలకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలకు కేటాయించిన యూరియాను కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియాను పైవుడ్, రెసిన్, పెయింట్స్, వార్నిష్ పరిశ్రమలు, జంతు, పౌల్ట్రీ, ఫీడ్ యూనిట్లలో, సారాయి తయారీలో వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సంచిపై రూ. 2 వేల వరకు రాయితీ ఇస్తోంది. కిలోకు రూ. 60 ఖరీదు చేసే నత్రజనిని ఉపయోగించాల్సిన పరిశ్రమలు… కిలోకు రూ. 6 తక్కువగా ఉన్న రాయితీ యూరియాను వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకొన్నట్లు తెలిసింది.
ఈ-పాస్ వివరాలేవీ
రైతు సేవాకేంద్రాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ లలో ఈ-పాస్లో ఆధార్ నంబరును నమోదు చేసి యూరియా సరఫరా చేయాలి. కానీ యంత్రాలు వాడటం లేదు. సంచి ధర రూ. 266.50 ఉండగా… రూ. 300-350కి అమ్ముతున్నారు.. రైతుల వారీగా లెక్కలు తీస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 200 పరిశ్రమలు పంటలకు ఉపయోగించే యూరియాను వాడుతున్నట్లు సమాచారం. వీటిపై దాడులు చేసి అడ్డుకోవాల్సిన యంత్రాంగం… మొక్కుబడిగా తనిఖీలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపినట్లు విమర్శలు వస్తున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని మాటల్లో చెబుతూ ఆచరణలో మాత్రం దళారులకు అండదండలు ఇస్తున్నారు.
లోపాయికారి ఒప్పందాలు…
జిల్లాలకు ఎంతో కొంత యూరియాను సరఫరా చేశారు. అయితే యూరియాను కొందరు మార్క్ ఫెడ్ అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కొన్ని జిల్లాలకు చెందిన మేనేజర్లు ఇష్టారాజ్యంగా బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వారితో ఒక కీలక అధికారి లాలూచీ పడుతున్నట్లు ఉద్యోగులే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. హోల్ సేల్, ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. లోపాయికారి ఒప్పందంతో డీలర్ల చేతుల్లో యూరియా పెట్టేశారు. వారి నుంచి అధికారులు కొందరు కమీషన్లు పొందుతున్నారు.