- కొందరు అధికారుల తీరుపై విమర్శలు
- రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్నందుకు పోస్ట్
- రాజకీయాలకు కొందరు అధికారుల దాసోహం
సహనం వందే, హైదరాబాద్:
ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు తమ హుందాతనాన్ని మరిచి రాజకీయ నాయకుల ముందు తలవంచడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సంచలనం రేపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్‌కు కీలక పదవి దక్కడంతో ఈ చర్చ మరోసారి రాజుకుంది. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. పాలకుల వద్ద ఆశ్రయం పొందిన అధికారులు ఉన్నతాశయాలను పక్కన పెట్టి, పదవుల కోసం ఆరాటపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాళ్లు పట్టుకుంటే పదవికి ఢోకా లేదు…
కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా సభ ముగిశాక స్టేజీ దిగి వెళ్తున్న సమయంలో అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ శరత్ ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి బహుమతి అందజేస్తూనే శరత్ కాళ్లకు నమస్కరించడం వీడియోల్లో రికార్డైంది. అయితే రేవంత్ రెడ్డి ఈ ఘటనను గమనించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. కాళ్లు పట్టుకున్నందుకు పదవి దక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రిటైర్మెంట్ తర్వాతా రెండేళ్ల పదవి…
సీఎంకు కాళ్లు మొక్కిన మూడు నెలల తర్వాత పదవీ విరమణ పొందిన శరత్‌కు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం... శరత్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేసిన అధికారి రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాంటి పదవిని పొందడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కినందుకే ఈ పదవి దక్కిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కాళ్లను ఆయన మొక్కారు. అంతేకాదు అప్పట్లో ప్రజారోగ్య సంచాలకులుగా పని చేసిన డాక్టర్ శ్రీనివాసరావు కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను మొక్కారు. అందరి ముందే కాళ్లు మొక్కుతున్న ఈ అధికారులు… ఎవరూ లేని సమయంలో సాష్టాంగాలు చేస్తుంటారని పలువురు విమర్శిస్తున్నారు.