- బాధల కంటే బలవంతులమంటున్న సబల
- నవంబర్లో జరిగే పోటీలకు ఎంపికైన నదీన్
- మొట్టమొదటిసారి ఎంపిక చేసిన కమిటీ
- స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చిన అందాల రాణి
సహనం వందే, పాలస్తీనా:
యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు.
అందం నీడలో సందేశం...
అందాల పోటీలు కేవలం రూపానికి సంబంధించినవి కాదు… ఆత్మగౌరవానికి, ఆశకు సంబంధించినవి అని మిస్ యూనివర్స్ సంస్థ మరోసారి నిరూపించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పోటీదారులను స్వాగతిస్తున్నామని… వైవిధ్యం, సంస్కృతి, మహిళల సాధికారతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ ప్రకటించింది. న్యాయవాది,మోడల్ అయిన నదీన్ అయూబ్, తమ వేదికపై పాలస్తీనా ప్రజల స్థితిని, దృఢసంకల్పాన్ని సూచిస్తారని సంస్థ తెలిపింది. నవంబర్ 21న బ్యాంకాక్‌లో జరిగే ఈ పోటీలో ప్రపంచం ముందు పాలస్తీనా తరపున ఆమె నిలబడనున్నారు.
మిస్ పాలస్తీనా కల…
27 ఏళ్ల నదీన్ అయూబ్ 2022లో మిస్ పాలస్తీనాగా ఎంపికయ్యారు. అప్పటినుంచే ఆమె కేవలం ఒక అందాల రాణిగా కాకుండా, తమ ప్రజల గొంతుకగా మారాలని కలలు కన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండ, హృదయ విదారక సంఘటనల నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్న మాటలు ఎందరి హృదయాలనో తాకాయి. ‘ఈ బాధాకరమైన సమయంలో… మౌనంగా ఉండలేని తమ ప్రజల గొంతును ప్రపంచానికి వినిపించనున్నట్లు’ ఆమె రాశారు.

బాధల కంటే బలవంతులం…
తన పోస్ట్‌లో ఆమె రాసిన ప్రతి అక్షరం పాలస్తీనా ప్రజల ఆవేదనకు అద్దం పట్టింది. ప్రతి పాలస్తీనా మహిళ, పిల్లల బలాన్ని ప్రపంచం చూడాలని తాను కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. “మేము మా బాధల కంటే బలవంతులం. మేము కేవలం బాధితులం కాదు. మేము మా దేశపు హృదయ స్పందన. ఈ వేదికపై నిలబడటం నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు. నా ప్రజల ఆత్మగౌరవం” అని ఆమె పేర్కొన్నారు. ఆమె మాటలు కేవలం వ్యక్తిగత భావాలు కావు. అది ఒక జాతి మొత్తం అనుభవిస్తున్న కష్టం. కానీ వదలని ధైర్యం.

యుద్ధం ముగిసి… గుర్తింపు దక్కేనా?
నదీన్ అయూబ్ మిస్ యూనివర్స్ వేదికపై అడుగుపెట్టే సమయం… ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్న దశలో రావడం ఒక కీలకమైన పరిణామం. గత అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో సుమారు 62,000 మందికి పైగా మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలేనని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పాలస్తీనాను గుర్తించాలని ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే 145కు పైగా దేశాలు దీనికి మద్దతు ప్రకటించాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా పాలస్తీనాను గుర్తించేందుకు ప్రణాళికలు ప్రకటించాయి. ఈ రాజకీయ, సామాజిక పరిణామాల మధ్య నదీన్ ఒక అందాల పోటీలో పాల్గొనడం, అది పాలస్తీనాకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఒక చిన్న ముందడుగు అని చెప్పవచ్చు. నదీన్ అయూబ్ ఆశలు, కలలు, ఆప్యాయతతో కూడిన ఆమె ప్రయాణం, యుద్ధంతో అల్లాడుతున్న పాలస్తీనా ప్రజలకు ఒక కొత్త ఆశను, ధైర్యాన్ని ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.