పంట కోర్సుల్లో వాటా మంట – వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కోటా కిరికిరి

  • వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కోటా కిరికిరి
  • ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ నిర్వాకం
  • ప్రవేశాల్లో రైతు, కూలీల కోటాపై గందరగోళం
  • కూలీల పిల్లలు సర్కారు బడుల్లో చదివితేనే…
  • అలాగే కేవలం రెండు కోర్సులకే కోటా వర్తింపు

సహనం వందే, హైదరాబాద్:
వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ రైతులు, వ్యవసాయ కూలీల కోటా అమలుపై విమర్శలు వచ్చాయి. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నా, కోటా నిబంధనలు గ్రామీణ వర్గాలకు నిజంగా న్యాయం చేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రైతు, కూలీ కుటుంబాలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, కొన్ని విధానపరమైన లోపాలు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎకరం కంటే తక్కువ భూమి ఉంటే?
బీఎస్సీ అగ్రికల్చర్‌లో 25 శాతం సీట్లు రైతు కోటా కింద రిజర్వ్ చేశారు. అయితే ఈ కోటాకు అర్హత పొందాలంటే కనీసం ఒక ఎకరం భూమి సొంతంగా సాగు చేసే కుటుంబం నుంచి రావాలి. ఈ నిబంధన నిజానికి చిన్న రైతులకు, ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారికి అన్యాయం చేస్తోందనే విమర్శ ఉంది. వ్యవసాయంపైనే ఆధారపడినప్పటికీ, భూమి తక్కువగా ఉన్న కుటుంబాలు ఈ కోటా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాయి. ఇది ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రైతు కుటుంబాలకే ఎక్కువ లాభం చేకూరుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతు కోటా కేవలం భూమి ఉన్నవారికి మాత్రమేనా? నిజంగా వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకునే ప్రతీ కుటుంబానికి వర్తించదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలను కూలీ కోటాలో చేర్చారు. అయితే అందులో ఉన్నవారికి అన్ని కోర్సుల్లో చేరే అవకాశం దొరకదు.

కూలీ కోటాలో నిబంధనల సంక్లిష్టత…
వ్యవసాయ కూలీల కోటా కింద 15 శాతం సీట్లు బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో కేటాయించారు. మిగిలిన మూడు కోర్సుల్లో వీరికి అవకాశం కల్పించలేదు. ఈ కోటా అర్హతకు అభ్యర్థులు నాలుగో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో లేదా గురుకులాల్లో చదివి ఉండాలనే నిబంధన విధించారు. దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చాలామంది కూలీలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల్లో చదివిన వారికి మాత్రమే కోటాకు అర్హత ఇవ్వడం వల్ల నిర్ణీత వర్గానికి కాకుండా పోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇది సామాజిక న్యాయం స్ఫూర్తిని దెబ్బతీస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కూలీల కోటాలో కేవలం రెండు కోర్సులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో వీరికి కోటా లేకపోవడం పట్ల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా… కోటాకు అనుసంధానం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ, ఈ పథకం… విద్యా కోటాల మధ్య సరైన సమన్వయం లేదు. రైతు భరోసా లబ్ధిదారులు రైతు కోటాకు అర్హత పొందడంలో భూమి సాగు నిబంధన ఒక అడ్డంకిగా మారింది. ఉదాహరణకు కౌలు రైతులు లేదా భూమి లేని వ్యవసాయ కూలీలు రైతు భరోసా కింద లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ, వారు రైతు కోటాకు అర్హులు కాదు. ఈ సమన్వయం లోపం వల్ల రైతు భరోసా ఆర్థిక సాయం అందించినా, విద్యా అవకాశాలు కల్పించడంలో అడ్డంకులు వస్తున్నాయి.

సంస్కరణలు తప్పనిసరి…
ఈ సమస్యలను అధిగమించడానికి రైతు, కూలీ కోటాల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. భూమి ఆధారిత అర్హతలను మార్చి, వాస్తవంగా వ్యవసాయాన్ని జీవనోపాధిగా చేసుకున్న ప్రతి కుటుంబానికి కోటాలను వర్తింపజేయాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచాలి. పరీక్షల సంక్లిష్టతను తగ్గించి, గ్రామీణ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే తెలంగాణలో వ్యవసాయ విద్యలో నిజమైన సామాజిక న్యాయం సాధించగలమని విమర్శకులు అంటున్నారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతోంది. ర్యాంకుల ఆధారంగా షెడ్యూల్ రూపొందించినప్పటికీ, సమాచారం సకాలంలో అందక గ్రామీణ అభ్యర్థులు, ముఖ్యంగా రిజర్వేషన్ కోటా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *