- ఎలక్ట్రానిక్ ఎన్నికలతో గోల్‌మాల్ అన్న ట్రంప్
- బ్యాలెట్ ఎన్నికలు తీసుకొస్తానని వెల్లడి
- మరోవైపు ఇండియాలో ఈవీఎంల తప్పిదాలు
- నాడు గెలిచిన సర్పంచ్ నేడు ఓడిపోయాడు
- సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపుతో తారుమారు
సహనం వందే, న్యూఢిల్లీ:
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఆ ఓటును నమోదు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎంలు) ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఈ యంత్రాలు గొడ్డలిపెట్టుగా మారాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలకు బదులు కాగితపు బ్యాలెట్ కు మారుతామని ప్రకటించడం, భారత్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలలోని లోపాలను బయటపెట్టడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
అమెరికాలో ఈవీఎంల మీద అనుమానాలు…
అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఈవీఎంలలోని లోపాలపై ఆధారాలను కూడా ఆమె సమర్పించారు. దీంతో 2026 మధ్యంతర ఎన్నికల నాటికి ఈవీఎంలను రద్దు చేసి, కాగితపు బ్యాలెట్లను తిరిగి ప్రవేశపెడతామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు కాగితపు బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని, ఆ విధానం సురక్షితమని గబ్బార్డ్ వివరించారు.
సుప్రీంకోర్టుకు ఈవీఎం ఓట్ల పంచాయితీ…
భారత్‌లో కూడా ఈవీఎంలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. హరియాణాలోని బవునా లఖూ గ్రామంలో 2022లో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తించాయి. ఆ ఎన్నికల్లో కులదీప్ సింగ్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కానీ ఓడిన అభ్యర్థి మోహిత్ సింగ్ ఫలితాలను సవాల్ చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరగా, కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో ఓట్లను మళ్లీ లెక్కించారు. ఆ లెక్కల్లో మోహిత్ సింగ్ విజేతగా నిలిచాడు. రెండేళ్ల తర్వాత ఒక వ్యక్తి విజేతగా ప్రకటించడం ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలను మరింత పెంచింది.
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న మస్క్…
ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమని స్పష్టం చేశారు. భారత్‌లో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత ముదిరింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో జరిగిన వ్యత్యాసాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల స్థానంలో కాగితపు బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒంగోలులో జరిగిన ఓట్ల గోల్‌మాల్‌పై ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.
ఈసీఐ వాదనలు, ప్రజల అనుమానాలు…
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మాత్రం ఈవీఎంలు సురక్షితమని, వాటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయమని చెబుతోంది. అందువల్ల వాటిని హ్యాక్ చేయడం అసాధ్యమని వాదిస్తోంది. ఇతర దేశాల్లోని సంక్లిష్ట ఓటింగ్ విధానాలతో పోలిస్తే భారత ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ఈసీఐ పేర్కొంది. అయితే హరియాణాలో జరిగిన సంఘటన, అమెరికాలో పెరుగుతున్న విమర్శలు ఈసీఐ వాదనలను ప్రశ్నిస్తున్నాయి.