- రైతులకు టోకెన్లు ఇచ్చి క్యూలైన్లను ఆపాలి
- ముందు చిన్న రైతులకు ఇవ్వాలని నిర్ణయం
- రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల కొరత
- యూరియా తక్కువ వాడాలని పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
కీలకమైన వర్షాల సమయంలో యూరియాను రైతులకు అందజేయడంలో తెలంగాణ మార్క్ ఫెడ్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న కొందరు దళారులతో… మరికొందరు అధికారులు కుమ్మక్కైనట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్లు స్వయానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. యూరియా కొరత ఉన్నందున సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. షరతులతో యూరియాను సప్లై చేయాలని ఆదేశించారు.
క్యూలైన్లతో తలనొప్పి…
రాష్ట్రంలో రైతులు అనేకచోట్ల యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారని ఆయన సంబంధిత అధికారులను నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏప్రిల్ లో 1.7, మే లో 1.6, జూన్ లో 1.7, జులైలో 1.6, ఆగస్టులో 1.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించి,
ఏప్రిల్ లో 1.21, మేలో 0.88, జూన్ లో 0.98, జులైలో 1.43, ఆగస్టులో 0.82 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయలేక పోవటం వలన ప్రస్తుతం రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడటంతో రైతులకు పంటకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేకపోతున్నామని ఆయన చేతులెత్తేశారు.

యూరియా సరఫరాకు మార్గదర్శకాలు...
- ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి.
- వ్యవసాయశాఖ నుండి వచ్చే రేక్స్ వివరాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని మండలాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలి.
- యూరియా సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద రైతుల అవసరాలకు విడతల వారిగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలి.
- అవసరమైతే పట్టాదారు పాసుపుస్తకాలు అనుసంధాన చేయాలి. రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలి.
- యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, అన్ని శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పరిచి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
- అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో లింక్ పెట్టే ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.
- పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్, యూనిట్‌పై కేసులు నమోదు చేయాలి.
- యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల టాప్ 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలి.
- యూరియాను మితంగా ఉపయోగించాలనీ, నానో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, బయో-ఫెర్టిలైజర్స్ వంటివి వినియోగించమని ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టాలి.
- మండలాల వారీగా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి వ్యవసాయశాఖ, పోలీస్, సహకార సంస్థలతో సమన్వయం చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలి.