‘చిరు’ చొరవ – టాలీవుడ్ కార్మికుల సమస్యపై చర్చ

  • 15 రోజుల్లో జరుగుతున్న సమ్మె

సహనం వందే, హైదరాబాద్:
టాలీవుడ్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 15 రోజులుగా జరుగుతున్న సమ్మెను నిలుపుదల చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు నిర్మాతలతో ఆయన చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటు నిర్మాతల మధ్య, అటు కార్మికుల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు.

15 రోజుల పోరాటం…
వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనితో టాలీవుడ్ షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. 2 వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నవారికి 25 శాతం జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ, కొన్ని కండిషన్లు పెట్టడంతో కార్మికులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది.

చిరంజీవి వద్దకు చేరిన పంచాయతీ…
ఈ నేపథ్యంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు చెందిన కొంతమంది నిర్మాతలు చిరంజీవిని కలిసి సమస్యను వివరించారు. ఈ భేటీ తర్వాత నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ‘సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చార’ని తెలిపారు.

కార్మికుల ఆవేదన…
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ డిమాండ్లను స్పష్టం చేశారు. సమావేశం అనంతరం అనిల్ మాట్లాడుతూ, ’24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా నిందలు వేస్తున్నారని, మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారని ఆయనకు వివరించాం. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలు కూడా బాగుండాల’ని చెప్పారు.

పరిష్కారం దిశగా అడుగులు…
నిర్మాతలు పెట్టిన రెండు నిబంధనలకు ఒప్పుకుంటే తామేం నష్టపోతామో చిరంజీవికి వివరించామని, డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పామని అనిల్ పేర్కొన్నారు. ‘మాకు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు రమ్మని చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని ఆపేశాం. త్వరలోనే మాకు వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నామ’ని ఆయన అన్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ఫిలిం ఛాంబర్‌లో సమావేశమై సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కు అప్పగించారు. దీంతో త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని, సమస్య పరిష్కారమవుతుందని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *