- ‘ట్రైలర్ లాంచ్ జరగకుండా నిలిపివేత
- వివేక్ అగ్నిహోత్రికి చేదు అనుభవం
సహనం వందే, కోల్‌కతా:
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కోల్‌కతాలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తన తాజా చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు, థియేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. అగ్నిహోత్రి తన సినిమాలతో అగ్గి రాజేయడం అలవాటే కాబట్టి, బెంగాల్‌లో కూడా అదే జరుగుతుందని ఊహించవచ్చు.
వివాదాస్పద సినిమాలు…
వివేక్ అగ్నిహోత్రి గతంలో కశ్మీర్ ఫైల్స్, తాష్కెంట్ ఫైల్స్ వంటి చిత్రాలను తీసి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపారు. ఆయన తీసిన సినిమాలు ఒక వర్గానికి చెందిన వారి కథలను మాత్రమే చూపిస్తాయని, వాటి వెనుక ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండా ఉందని విమర్శకులు ఆరోపిస్తుంటారు. ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ కూడా 1946లో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల నేపథ్యాన్ని చూపిస్తుందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని సున్నితమైన రాజకీయ, సామాజిక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉండటంతో ఈ సినిమా విడుదల కాకముందే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా?
బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ లాంచ్ కోసం మొదట పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా అనుమతి కోరగా సరైన సమాధానం రాకపోవడంతో కార్యక్రమం రద్దయ్యింది. ఒక థియేటర్‌లో కార్యక్రమం నిర్వహించాలనుకుంటే రాజకీయ ఒత్తిడి కారణంగా థియేటర్ యాజమాన్యం సహకరించలేదని అగ్నిహోత్రి ఆరోపించారు. దీంతో వారు ఒక హోటల్‌కు కార్యక్రమాన్ని మార్చారు. అయితే అక్కడ కూడా రెండుసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటనను ఆయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంటే అగ్గితో ఆటలాడుకోవడమే అనే అంశం మరోసారి స్పష్టమైంది.
రాజకీయ డ్రామాగా టీఎంసీ విమర్శలు…
ఈ సంఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా స్పందించింది. అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ… ఇది పూర్తిగా రాజకీయ డ్రామా అని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ చిత్రం తీశారని ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చిత్రాలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఆయన హెచ్చరించారు. మొత్తానికి బెంగాల్ ఫైల్స్ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రాజకీయ చర్చలకు దారితీస్తుందో చూడాలి. ఇది వివేక్ అగ్నిహోత్రి, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మరో రాజకీయ పోరాటానికి తెరలేపనుంది.