- శవాల గుట్టలతో నిండిపోయిన పుణ్యక్షేత్రం
- శవాల పూడ్చివేతకు ఆలయం నుంచే ఆదేశం
- జాతీయ మీడియాతో పారిశుద్ధ్య కార్మికుడు
- వందలాది శవాలను పాతిపెట్టినట్టు వెల్లడి
సహనం వందే, బెంగళూరు:
సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు.

ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…
తాను, తన బృందం గుర్తు తెలియని వందలాది మృతదేహాలను అడవుల్లో, నదీ తీరాల్లో పాతిపెట్టినట్లు తెలిపారు. ఈ సమాధులకు సంబంధించి గ్రామ పంచాయతీ లేదా స్థానిక అధికారుల నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆలయంలోని సమాచార కేంద్రం నుంచే ఈ ఆదేశాలు వచ్చాయని, తాము వాటిని ఖచ్చితంగా పాటించామని ఆయన చెప్పారు. ఇది ఆలయ పనుల్లో అంతర్గతంగా జరిగిందని ఆయన వివరించారు.
రహస్య ఖననాలు ఎక్కడెక్కడో…
ఈ సమాధులు సాధారణ స్మశాన వాటికల్లో కాకుండా అడవులు, పాత రోడ్లు, నదీ తీరాల వంటి ప్రాంతాల్లో జరిగాయని ఆ వ్యక్తి వెల్లడించారు. బాహుబలి హిల్స్‌లో ఒక మహిళ మృతదేహాన్ని, నేత్రావతి స్నాన ఘట్టం వద్ద సుమారు 70 మృతదేహాలను సమాధి చేశామని ఆయన తెలిపారు. స్పాట్ 13 అనే ప్రాంతంలో 70 నుంచి 80 మృతదేహాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. స్థానికులు అప్పుడప్పుడు ఈ సమాధులను చూసినప్పటికీ ఎవరూ జోక్యం చేసుకోలేదని, తమకు ఆదేశాలు వచ్చాయని, తాము ఆ పని చేశామని ఆయన వెల్లడించారు.
మహిళలే ఎక్కువమంది…
సమాధి చేసిన మృతదేహాల్లో చాలా వరకు హింసకు గురైనట్లు స్పష్టమైన గుర్తులు ఉన్నాయని, కొన్ని మృతదేహాలపై లైంగిక వేధింపుల సూచనలు కనిపించాయని ఆయన ఆరోపించారు. మరణానికి కచ్చితమైన కారణం తనకు తెలియదని, వైద్య నిపుణులు మాత్రమే దీనిని నిర్ధారించగలరని ఆయన అన్నారు. సమాధి చేసిన వంద మృతదేహాల్లో 90 మంది మహిళలేనని, వారిలో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నారని ఆయన చెప్పడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

దర్యాప్తునకు అడ్డంకులు…
ఈ సమాధి ప్రాంతాలు కాలక్రమేణా మారిపోయాయని, అడవులు దట్టంగా మారడం, నిర్మాణ పనులు, వరదలు వంటి కారణాలతో కొన్ని స్థలాలను గుర్తించడం కష్టమైందని ఆయన తెలిపారు. గతంలో ఉన్న పాత రోడ్లు ఇప్పుడు కనిపించడం లేదని, అడవులు దట్టంగా మారడంతో కొన్ని స్థలాలను గుర్తించలేకపోతున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 13 ప్రాంతాల నుంచి కొన్ని అస్థిపంజర శకలాలను సేకరించిందని, వాటిలో ఒకటి పురుషుడిదని గుర్తించారని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు బృందం తనను పూర్తిగా నమ్మడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. తన జ్ఞాపకశక్తి ఆధారంగా సమాధి ప్రాంతాలను చూపిస్తున్నానని… కానీ స్థలం, మట్టి మారిపోవడంతో కచ్చితమైన స్థలాలను గుర్తించడం కష్టమని ఆయన వివరించారు.
సౌజన్య హత్య కేసు జ్ఞాపకాలు
2012లో ధర్మస్థల సమీపంలో 17 ఏళ్ల సౌజన్య అనే యువతి హత్యకు గురైన సంఘటనను కూడా ఆయన గుర్తు చేశారు. ఆ రాత్రి తాను సెలవుపై స్వస్థలంలో ఉన్నానని, ఆ విషయం చెప్పగా అధికారులు తనపై కోప్పడ్డారని ఆయన అన్నారు. మరుసటి రోజు సౌజన్య మృతదేహాన్ని చూశానని, ఆ సంఘటన తనను కలచివేసిందని ఆయన తెలిపారు. ఆనాటి నుంచి ఈ సమాధుల బాధ్యత తనను రెండు దశాబ్దాలుగా వెంటాడుతోందని, అస్థిపంజరాల కలలు తనను వేధించాయని ఆయన వాపోయారు.
మృతదేహాలకు గౌరవం ఇవ్వాలనే ఆశ
‘బాధతోనే ధర్మస్థలకు తిరిగి వచ్చాను. నేను సమాధి చేసిన మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెట్టాను. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. మృతదేహాలను గుర్తించి సరైన గౌరవం ఇవ్వాలనే నా ఆకాంక్ష’ అని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాల నుంచి నగలు దొంగిలించినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను హిందువునని, షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తినని, దొంగతనం చేయాల్సి ఉంటే ఆలయంలో ఎందుకు పనిచేస్తానని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ రచ్చ…
ఈ సామూహిక సమాధుల కేసు జులై మధ్యలో వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి 2014 వరకు ఆలయ ఆదేశాలతో 100కు పైగా మృతదేహాలను సమాధి చేసినట్లు ఈ వ్యక్తి ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 13 నుంచి 15 సమాధి ప్రాంతాలను తవ్వి, కొన్ని అస్థిపంజర శకలాలను సేకరించింది. ఈ కేసు ధర్మస్థల ఆలయంపై తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది.