- ఆహార సరఫరా రంగంలోకి ప్రవేశం
- ఓన్లీ యాప్ తో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు
- బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభం
- త్వరలో దేశవ్యాప్తంగా సేవల విస్తరణ
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో రైడ్-హెయిలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి దూసుకువచ్చింది. ‘ఓన్లీ’ (Ownly) అనే కొత్త యాప్‌తో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ యాప్ సరసమైన ధరల్లో భోజనం అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో ఈ కొత్త అడుగుతో భారతీయ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుంది.
తక్కువ ధరలో రుచికరమైన భోజనం…
రాపిడో ఓన్లీ యాప్‌ను బెంగళూరులోని కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్ వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ యాప్‌లో చాలా ఆహార పదార్థాలు రూ.150 లోపు ధరలో లభిస్తాయి. చపాతీ, అన్నం, గుడ్డు వంటి రోజువారీ అవసరమైన వంటకాలు రూ.100 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫాసోస్, క్రిస్పీ క్రీమ్, వావ్ మోమో, ఈట్‌ఫిట్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి ఆహారాన్ని సరసమైన ధరలతో అందిస్తూ, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రెస్టారెంట్లకు తక్కువ కమీషన్…
రాపిడో ఓన్లీ యాప్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని కమీషన్ విధానమే. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి 16 నుంచి 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. కానీ ఓన్లీ ఈ కమీషన్‌ను తక్కువ చేసింది. ఇది రెస్టారెంట్లకు ఆర్థికంగా ఊరటనిస్తోంది. దీనికి బదులుగా నాలుగు కిలోమీటర్లలోపు ఆర్డర్లకు మాత్రమే రెస్టారెంట్లు డెలివరీ ఫీజు చెల్లించాలి. రూ.100 లోపు ఆర్డర్లకు రూ.10, రూ.100 నుంచి రూ.400 మధ్య ఆర్డర్లకు రూ.25, రూ.400 పైబడిన ఆర్డర్లకు రూ.50 డెలివరీ ఫీజుగా వసూలు చేస్తారు.
రాపిడో డెలివరీ బలమే ఓన్లీకి ఉపయోగం…
రాపిడో తనకున్న బలమైన డెలివరీ నెట్‌వర్క్‌ను ఓన్లీ కోసం వినియోగించుకుంటోంది. దేశవ్యాప్తంగా 40 లక్షల మంది డెలివరీ భాగస్వాములతో రోజుకు 35 లక్షల రైడ్‌లను నిర్వహిస్తూ, 500 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. ఈ భారీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఓన్లీ ద్వారా వేగవంతమైన డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్…
భారతదేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్‌ను స్విగ్గీ, జొమాటో దాదాపు 90 శాతం తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ రెండు సంస్థలు రోజుకు 45 లక్షల డెలివరీలను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు వసూలు చేసే భారీ కమీషన్లు రెస్టారెంట్లకు భారం, వినియోగదారుల నుంచి వారికి తెలియకుండా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాపిడో ఓన్లీ ఈ సమస్యలను లక్ష్యంగా చేసుకుని, సరసమైన ధరలు, పారదర్శక ఛార్జీలతో మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
బెంగళూరు నుంచి దేశవ్యాప్త విస్తరణ…
ఓన్లీ ప్రస్తుతం బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాపిడో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సహకారంతో రెస్టారెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ యాప్‌ను మరింత బలోపేతం చేయడానికి రాపిడో ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 50,000కు పైగా రెస్టారెంట్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.