- రజినీ, నాగార్జున, అమీర్ ఖాన్ లతో కళకళ
- వార్-2లో ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో
- ఎన్టీఆర్ అభిమానులు తట్టుకోవడం కష్టమే
- మొదటి సగం బాగు… తర్వాత గందరగోళం
- ఎన్టీఆర్ కు హీరోయిన్ లేకపోవడం మైనస్
- కూలీ రేటింగ్: 3/5… వార్ -2 రేటింగ్: 2.5/5
సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:
భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది.

రజనీకాంత్ స్టైల్… లోకేశ్ మార్క్ కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ వాచ్ స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో రజనీకాంత్ పక్కన నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం నటించింది. రజనీకాంత్ బ్రాండ్ వాల్యూ, లోకేశ్ మార్క్ స్టైలిష్ డైరెక్షన్ కారణంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, నాగార్జున విలనిజం, ఆమిర్ ఖాన్ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం, ముఖ్యంగా కూలీ డిస్కో వంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ వెలవెల…
యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన వార్ 2లో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ‘ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడ’నే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు సపోర్ట్ చేస్తుంటాడు. దీన్ని ఆర్మీలో కీలక స్థాయిలో ఉన్న హృతిక్ రోషన్ కనిపెడతాడు.

ఈ సినిమాలో విమానంపై ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని చెప్పక తప్పదు. పైగా తెలుగు అభిమానులు ఆయనను విలన్ గా ఏమాత్రం అంగీకరిస్తారనేది అనుమానమే. చావు అంచుకు చేరిన తర్వాత ఎన్టీఆర్ తన తప్పులు తెలుసుకొని దేశం కోసం పనిచేయడమే కరెక్ట్ అని మారిపోతాడు. అలా చివరకు ఆయనను కూడా హీరోగా ప్రజెంట్ చేశారు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర అంతంతే. ఆమె హృతిక్ రోషన్ ను ప్రేమిస్తుంది. ఎన్టీఆర్ కు మాత్రం ఎలాంటి హీరోయిన్ ని పెట్టలేదు. ఆయన సినీ చరిత్రలో హీరోయిన్ లేకుండా నటించిన సినిమా ఇదేనని సినీ పండితులు అంటున్నారు.