‘హైడ్రా’పై అవాస్తవాల దాడి – పుకార్లను నమ్మవద్దు

  • కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి
  • వాహన రంగులపై అవాస్తవాలు
  • ఎఫ్‌టీఎల్ పరిధిలోనే తమ్మిడికుంట అభివృద్ధి
  • హైడ్రాకు సంబంధం లేకున్నా దుష్ప్రచారం

సహనం వందే, హైదరాబాద్:
హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా, లేనిపోని అంశాలను హైడ్రాకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. అయినా హైడ్రా ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేయడానికే కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో కూడిన నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. ఈ పనులను కేంద్ర బృందాలు కూడా సందర్శించి అభినందించాయి. ఇంకా 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల మద్దతు లభిస్తున్న ఈ సమయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

ఎఫ్‌టీఎల్ పరిధిలోనే తమ్మిడికుంట అభివృద్ధి…
మాదాపూర్‌లోని శిల్పారామం ముందు ఒకప్పుడు భారీగా వరద నీరు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేవి. హైడ్రా ఆరు చెరువుల పునరుద్ధరణలో భాగంగా తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా చెరువులో పూడిక తీసి, వరద కాలువను మళ్లించింది. ఈ పనుల వల్ల ఇప్పుడు అక్కడ వరద నీరు నిలవడం లేదు. తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్)ను 2014లో హెచ్‌ఎండీఏ నిర్ధారించింది. 2016లో దీనిపై తుది నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారం తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం 29.26 ఎకరాలు. ఈ తుది నోటిఫికేషన్ ప్రకారమే చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా స్వచ్ఛందంగా భూమిని అప్పగించి చట్ట ప్రకారం పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అసైన్డ్ భూమిపై వివాదం…
తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్‌లో 6.12 ఎకరాల శిఖం పట్టా భూమి కూడా ఉంది. అయితే అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసైన్డ్ భూమి కావడంతో దానిని అమ్మడం లేదా కొనడం చట్ట విరుద్ధం. కానీ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 1.07 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. ఇదే విధంగా మరికొందరు కూడా కొన్నారు. ఇది ప్రభుత్వ భూమా, ప్రైవేటుదా అనే విషయంపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు వెంకటేశ్వరరావుకు అనుకూలంగా వస్తే చట్ట ప్రకారం పరిహారం పొందవచ్చని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ కొన్ని మీడియా వర్గాల్లో వచ్చిన వార్తలను రంగనాథ్ ఖండించారు. చట్టాలు, కోర్టులంటే తమకు పూర్తి గౌరవం ఉందని, ఇప్పటివరకు అనేక కార్యక్రమాలను కోర్టు ఆదేశాల మేరకు పూర్తి చేసిందని పేర్కొన్నారు.

వాహన రంగులపై అవాస్తవాలు…
గతంలో జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) వాహనాలకు ఉపయోగించిన రంగులే ఇప్పుడు కూడా వాడుతున్నారు. గత ఏడేళ్లుగా ఇవే రంగులు కొనసాగుతున్నాయని, కేవలం ఈవీడీఎం అనే పేరుకు బదులుగా హైడ్రా పేరు, లోగో మాత్రమే మారాయని రంగనాథ్ వివరించారు. అసహజ రంగులు వాడుతున్నారని కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేశారు.

హైడ్రాకు సంబంధం లేకున్నా దుష్ప్రచారం…
కూకట్‌పల్లి-హైటెక్ సిటీ వంతెన వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి వంతెన పారాపెట్ గోడకు రంధ్రం చేసి నీటిని బయటకు పంపారు. వంతెన నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ పని చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ నిపుణులు కూడా ధ్రువీకరించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చేసిన ఈ పనికి కొందరు లేనిపోని దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఈ పనికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు కావాలనే హైడ్రాకు అంటగట్టి పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవాస్తవాలను నమ్మకుండా, నిజాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *