ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…

  • ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 19 శాతమే పాస్
  • 37,207 మందిలో 6,707 మందే ఉత్తీర్ణత
  • జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి వెల్లడి
  • విదేశాల్లో ఎంబీబీఎస్… స్వదేశంలో ఝలక్

సహనం వందే, హైదరాబాద్:
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం 6,707 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు విదేశీ వైద్య విద్య నాణ్యతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

గత ఫలితాల విశ్లేషణ…
గత ఎఫ్‌ఎంజీఈ ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గుతోంది. డిసెంబర్ 2024లో 43,230 మంది పరీక్షకు హాజరైనప్పటికీ 13,149 మంది (29.62 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జూన్ 2024లో 34,608 మందిలో 7,233 మంది (20.9 శాతం), డిసెంబర్ 2023లో 37,827 మందిలో 7,781 (20.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 2023లో 10.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ హెచ్చు తగ్గులు విదేశీ వైద్య విద్య నాణ్యత, పరీక్ష ప్రమాణాలపై చర్చకు దారితీసింది.

ఉత్తీర్ణత సర్టిఫికెట్ల పంపిణీ…
ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఈ జూన్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లను వ్యక్తిగతంగా అందజేస్తారు. దీనికోసం గుర్తింపు, ఆధారాల పరిశీలన తర్వాత సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారు. ఈ పంపిణీ షెడ్యూల్‌ను ఎన్‌బీఈఎంఎస్ వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తారు. ఉత్తీర్ణతకు 300 మార్కులలో కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈనెల 21 తర్వాత వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌లు డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉంటాయని ఎన్‌బీఈఎంఎస్ తెలిపింది. ఈ స్కోర్‌కార్డ్‌లు ఆరు నెలల పాటు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌లోని ఫలితాల విభాగంలో తమ పేరును శోధించి, ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

విదేశీ వైద్య విద్య డొల్ల…
ఎన్‌బీఈఎంఎస్ ప్రకారం, జూన్ 2025 ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో అడిగిన ప్రతి ప్రశ్నను సంబంధిత వైద్య విభాగంలోని నిపుణులు పరిశీలించారు. ప్రశ్నలు, వాటి సమాధాన కీలలో ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని నిర్ధారించారు. ఈ పారదర్శకత విద్యార్థులలో విశ్వాసం కలిగించేందుకు ఉద్దేశించినప్పటికీ, భారీ సంఖ్యలో అనర్హత విదేశీ వైద్య విద్యా వ్యవస్థపై విమర్శలను తెరపైకి తెచ్చాయి. భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పటికీ, వారు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు అవసరమైన నైపుణ్యాలను సమర్థవంతంగా సాధించలేకపోతున్నారని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచడానికి విదేశీ వైద్య కళాశాలలు, భారతీయ నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *