మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ

  • ఆదాయం కోసం కేరళ కొత్త అడుగులు
  • ఇప్పటికే ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో అమలు

సహనం వందే, హైదరాబాద్:
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఆన్ లైన్ మద్యం అమ్మకాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

కేరళలో కొత్త ప్రతిపాదనలు…
కేరళ స్టేట్ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (బీఈవీసీఓ) మద్యం హోమ్ డెలివరీ కోసం ఒక కొత్త ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖకు పంపింది. గతంలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించినా, ఇప్పుడు మరోసారి పరిశీలించాలని కోరింది. ఆన్ లైన్ ద్వారా మద్యం డెలివరీ చేసేందుకు స్విగ్గీ కూడా తమకు ప్రాజెక్టు ప్రతిపాదనను పంపినట్లు బీఈవీసీఓ ఎండీ హర్షిత అత్తలూరి తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెండర్ ప్రక్రియ మొదలవుతుందని ఆమె అన్నారు. ఈ నిబంధనల ప్రకారం 23 ఏళ్లు నిండిన వ్యక్తికి మాత్రమే మద్యం ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది.

ఆదాయం పెంచుకోవడమే లక్ష్యమా?
మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడమే ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశమని బీఈవీసీఓ చెబుతోంది. కేరళలో కేవలం 283 మద్యం దుకాణాలు మాత్రమే ఉండటంతో క్యూలు భారీగా ఉంటున్నాయి. ఆన్ లైన్ అమ్మకాలతో ఈ రద్దీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా మద్యం హోమ్ డెలివరీ ద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని బీఈవీసీఓ భావిస్తోంది. గత ఏడేళ్లలో కేరళ ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాదాపు రూ. 8,778 కోట్ల నుంచి రూ. 19,700 కోట్లకు పెంచుకుంది. ఇప్పుడు ఆన్ లైన్ అమ్మకాలతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలు కూడా అదే బాటలో…?
ఆన్ లైన్ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు కొన్ని నియమాలు చెబుతున్నారు. ఈ విధానం అమలు కావాలంటే 1953 నాటి చట్టాలను సవరించాల్సి ఉంటుందని, దీనికి ముందుగా ప్రభుత్వం ఆమోదం తెలపాలని వారు అన్నారు. కరోనా సమయంలో కేరళ ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా ఆన్ లైన్ మద్యం అమ్మకాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కేరళలో ఈ విధానం విజయవంతమైతే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆదాయం కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *