- రాజగోపాల్ రెడ్డి వివాదంలో భట్టి జోక్యం
- మంత్రి పదవి హామీ నిజమేనని వెల్లడి
- దీంతో విక్రమార్కకు కోమటిరెడ్డి కృతజ్ఞత
- ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఇరకాటం
సహనం వందే, హైదరాబాద్:
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాయి. పార్టీలో మరింత ముదురుతున్న ఈ వ్యవహారంపై భట్టి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా, పార్టీలోని ముఖ్య నేతల పైనా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన చేసిన ట్వీట్ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ లో చేరినప్పుడు ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరకపోవడంపై ఆయన పరోక్షంగా తన నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.
మంత్రి పదవి వాస్తవమే అన్న భట్టి…
తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ వాస్తవమేనని అంగీకరించారు. అయితే సామాజిక సమీకరణల కారణంగా అది సాధ్యం కాలేదని చెప్పారు. భట్టి వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలోని ముఖ్య నేతలు అడ్డుపడుతున్నారని, తనను అవమానిస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గానికే మేలు అని…
రాజగోపాల్ రెడ్డి కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే చూడడం లేదని, మునుగోడు నియోజకవర్గ సమస్యలను మరింత వేగంగా పరిష్కరించడానికి మంత్రి పదవి అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. అవినీతి రహిత పాలన అందించాలి’ అంటూ ఆయన తన పోస్టులో వివరించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తన నియోజకవర్గంపై ఉన్న నిబద్ధతను చాటుకోవడమే కాకుండా, పరోక్షంగా ప్రభుత్వం తీరుపై విమర్శలు కూడా గుప్పించారు.
పార్టీలో అలజడి.. క్రమశిక్షణ చర్యలు?
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి, మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినా అసంతృప్తితోనే ఉన్నారని ఆయన మాటలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి పార్టీలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.