ఉబర్ రైడ్… ఉమెన్ డేంజర్ – ప్రయాణంలో లైంగిక వేధింపులు

  • ప్రతి 8 నిమిషాలకు ఒక వేధింపు, దౌర్జన్యం
  • భగ్గుమంటున్న మహిళా ప్రయాణికులు
  • నేర చరిత్ర ఉన్న డ్రైవర్లకూ అవకాశం
  • సందు గొందు రూట్లకు తీసుకెళుతున్న వైనం
  • మహిళా ప్రయాణికుల ఫోన్లకు మెసేజ్ లు
  • నియంత్రించలేకపోతున్న ఉబర్ సంస్థ

సహనం వందే, న్యూయార్క్:
ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ … తన ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన సేవలు ఇస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017-22 మధ్య కాలంలో లక్షలాది మంది ప్రయాణీకులు లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు గురైనట్లు తేలింది. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వేధింపు…
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… అమెరికాలో ఉబర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు లేదా దౌర్జన్యం కేసు కింద ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదుల్లో చాలావరకు మహిళా ప్రయాణీకుల నుంచి వచ్చినవే. ప్రయాణీకులకు ఉబర్ ఎంతమాత్రం సురక్షితం కాదని, కంపెనీ భద్రతా హామీలు డొల్లవని నిరూపిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన బాధితుల్లో చాలామంది తమ అనుభవాలను బహిర్గతం చేయడానికి సంకోచించినా, బయటికి వచ్చిన కేసుల సంఖ్యే ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

లాభాపేక్షే ఉబర్ లక్ష్యం…
ప్రయాణీకుల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడంలో ఉబర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దర్యాప్తులో స్పష్టమైంది. లైంగిక వేధింపుల సమస్య తీవ్రత తెలిసినా, భద్రతకు సంబంధించిన సంస్కరణలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైంది. డ్రైవర్ల బ్యాక్ గ్రౌండ్లను తనిఖీ చేయడంలో వైఫల్యం… ప్రయాణీకుల భద్రతకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను ప్రవేశపెట్టడాన్ని వృధా ఖర్చుగా భావించటం… కేవలం వ్యాపార వృద్ధి, లాభాలు, మార్కెట్ వాటాను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టడం వల్లే ఇటువంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని కూడా డ్రైవర్లుగా నియమిస్తున్నారు. అలాంటి డ్రైవర్లు మహిళలను కారులో ఎక్కించుకొని సందు గొందు రూట్లలో భద్రత లేని ప్రాంతాల్లో తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్తున్నావేంటని ప్రశ్నిస్తే… గూగుల్ మ్యాప్ ఇలాగే చూపిస్తుందని దబాయిస్తున్నారు.

బాధితుల నిస్సహాయత… న్యాయ పోరాటం
లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు. చాలామంది బాధితులు ఉబర్ నుంచి తగిన స్పందన లభించలేదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుని, వారికి తగిన సాయం అందించకుండా వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి బాధితుల్లో నిరాశను పెంచింది. కొందరు కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ ఖర్చుతో కూడుకున్న న్యాయ ప్రక్రియ వల్ల చాలామంది మధ్యలోనే వెనక్కి తగ్గుతున్నారు.

భద్రతా ఫీచర్ల సమర్థతపై సందేహాలు…
ఉబర్ ప్రయాణీకుల భద్రత కోసం రైడ్‌చెక్, ఎమర్జెన్సీ బటన్, రియల్-టైమ్ లొకేషన్ షేరింగ్ వంటి అనేక సాంకేతిక ఫీచర్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫీచర్ల సమర్థతపై అనేక సందేహాలు ఉన్నాయి. చాలామంది ప్రయాణీకులకు ఈ ఫీచర్ల గురించి అవగాహన లేకపోవడం, వాటిని ఉపయోగించడంలో సంకోచించడం, అన్ని ప్రాంతాల్లో అవి ఒకే విధంగా అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు డ్రైవర్, ప్రయాణీకుడి వ్యక్తిగత ఫోన్ నంబర్లు బయటపడకుండా ఉండేందుకు రూపొందించిన ‘ఫోన్ నంబర్ మాస్కింగ్’ ఫీచర్ కూడా కొన్ని సందర్భాల్లో విఫలమైంది. దీంతో భద్రతా ఫీచర్ల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *