- వైద్య విద్యార్థుల గంజాయి వ్యాపారం
- పర్యవేక్షణ లేక మెడికోల ఇష్టారాజ్యం
- అనేకచోట్ల సీసీటీవీలు పనిచేయవు
సహనం వందే, హైదరాబాద్:
మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు. మూడేళ్లుగా కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్‌పై ఈగల్ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో మెడిసిటీ వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ టెస్టులో గంజాయి పాజిటివ్ వచ్చిన పలువురు విద్యార్థుల్ని డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించారు. సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేశారని, వారే వాటిని విక్రయించినట్లు గుర్తించారు. వైద్య విద్యార్థులకు గంజాయి విక్రయించిన డ్రగ్ పెడ్లర్ బొల్లారానికి చెందిన హరాఫత్ అలీఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు అలీఖాన్ బీదర్‌కు చెందిన జరీనా బాను నుంచి గంజాయిని కొనుగోలు చేసి… వైద్య విద్యార్థులకు అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు.
చిన్న పెడ్లర్… పెద్ద నెట్‌వర్క్
పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న అర్ఫత్ అహ్మద్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని బైక్‌ను తనిఖీ చేయగా, రూ.50 వేల విలువైన 2 కిలోల గంజాయి లభించింది. ఈ చిన్న పరిమాణాన్ని చూసి అతన్ని ఒక చిన్న పెడ్లర్‌గా పోలీసులు భావించారు. కానీ అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని ఫోన్‌లో ఏకంగా 84 మంది గంజాయి వినియోగదారుల జాబితా ఉంది. వీరిలో 26 మంది మేడ్చల్ పరిధిలోని మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులే కావడం పోలీసులను నివ్వెరపరిచింది. గత మూడేళ్లుగా అర్ఫత్ నుంచి 100 మందికి పైగా విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కోటిన్నర టార్గెట్‌తో లేడీ డాన్ దందా…
అర్ఫత్‌కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు కూపీ లాగారు. బీదర్‌కు చెందిన జరీనా ఖాన్ అనే మహిళ నుంచి అర్ఫత్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. జరీనాకు అర్ఫత్ లాంటి పెడ్లర్లు దాదాపు 50 మంది ఉన్నారని పోలీసులు అంచనా వేశారు. అక్షరం ముక్క రాని ఈ మహిళ, ఇంటి నుంచే గంజాయి నెట్‌వర్క్‌ను నడిపిస్తోంది. బీదర్ నుంచి పెద్ద మొత్తంలో గంజాయి కొని, చిన్న ప్యాకెట్లుగా మార్చి హైదరాబాద్‌లోని పెడ్లర్లకు సరఫరా చేస్తోంది. ఇలా ఏడాదికి కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జరీనా బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బు ఉన్నట్లు గుర్తించి, వాటి వివరాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విచారణలో మరెన్ని సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.