మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు

  • ఎవరినో కాపాడుతున్నారని ఆరోపణ
  • సీబీఐ డైరెక్టర్ ను కలిసి ఆవేదన

సహనం వందే, న్యూఢిల్లీ:
కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు.

తల్లిదండ్రుల వాదన…
గత సంవత్సరం ఆగస్టు 9న రాత్రి విధి నిర్వహణలో ఉన్న తమ కుమార్తెను ఛాతీ వైద్య విభాగం సెమినార్ హాల్లో అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీబీఐ దర్యాప్తులో సంజయ్ రాయ్ అనే వాలంటీరును దోషిగా తేల్చి, అతనికి జీవిత ఖైదు విధించారు. అయితే సీబీఐ దర్యాప్తు ఒకరిపై మాత్రమే దృష్టి పెట్టడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. అంత భద్రత ఉండే చోట ఒక వ్యక్తి మాత్రమే ఈ ఘోరం చేయడం సాధ్యం కాదు. మొదట్లో జరిగిన ఆధారాలు చెరిపే ప్రయత్నాలను చూస్తే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంద’ని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

హడావుడిగా ఎందుకు దహనం చేశారు?
తమ కుమార్తె మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారని తండ్రి ఆరోపించారు. ‘ఆ రోజు శ్మశానవాటికలో మూడు మృతదేహాలు ఉన్నాయి. కానీ మా అమ్మాయి మృతదేహాన్ని ముందుగా దహనం చేశారు. ఎందుకంత తొందర? ఆధారాలు చెరిపేయడానికే ఆ ప్రయత్నం చేశారని మాకు అనిపిస్తోంద’ని ఆయన అన్నారు. హోం మంత్రి అమిత్ షాతో సహా ఇతర సీనియర్ నాయకులను కలవాలని వారు యోచిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిరసనకారులు కోల్‌కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం ఉన్న కాళీఘాట్ ప్రాంతానికి నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.

అత్యంత అరుదైనద కేసు కాదా?
సీల్దా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్, దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ నేరం ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైనది కాదని, అందుకే మరణశిక్ష విధించలేదని జడ్జి తెలిపారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసింది. ఇది ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన’ కేసు అని, రాయ్‌కు మరణశిక్షే సరైన శిక్ష అని సీబీఐ వాదించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *