ఢిల్లీలో సీఎంతో జర్నలిస్టుల భేటీ

  • హైదరాబాద్ లో ఇంటి స్థలాలు ఇవ్వాలని డీజేహెచ్ఎస్ విన్నపం
  • ఫ్యూచర్ సిటీ హామీని అమలు చేయాలని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తి

సహనం వందే, న్యూఢిల్లీ:
తెలంగాణలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు నవీన్ దుమ్మాజీ, సతీష్ యాదవ్ తదితరులు ఆయన నివాసంలో కలిశారు.

ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బొల్లోజు రవి, ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన విషయాన్ని వారు సీఎంకు వివరించారు. కాగా… ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో డీజేహెచ్ఎస్ బృందం 16.10.2023

కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని డీజేహెచ్ఎస్ బృందం కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీఎం అయ్యాక ఫ్యూచర్ సిటీలో జాగాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు.

జర్నలిస్టుల ఆశలపై సుప్రీం నీళ్లు…
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి పెట్‌ బషీరాబాద్‌లో కేటాయించిన 38 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిస్థితిని అంతా తలకిందులైంది. ఈ తీర్పు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును అడ్డుకుంటూ, వారి దశాబ్దాల కలను అగమ్యగోచరంగా మార్చింది. ‘బడుగు వర్గాలకు ప్రభుత్వం ఇళ్లు, స్థలాలు, సంక్షేమ పథకాలు అందిస్తుంది. జర్నలిస్టులు ఎక్కువమంది అదే వర్గాల నుంచి వచ్చినప్పుడు వారికి ఈ హక్కు ఉంటుంద’ని డీజేహెచ్ఎస్ అభిప్రాయపడుతోంది.

ఫ్యూచర్ సిటీపై ఆశలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. ‘జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఫైల్‌పై ఒక నిమిషంలో సంతకం చేస్తాను’ అని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో హామీ అమలు కోసం ప్రయత్నించాలని సీఎంను కోరుతోంది. ‘సీఎం సానుకూలంగా ఆలోచిస్తే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించేందుకు చర్యలు తీసుకోవచ్చు’ అని జర్నలిస్టు నాయకులు సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *