- కేంద్రం ప్రభుత్వంపై సన్నగిల్లిన విశ్వాసం
- బీసీలకు రిజర్వేషన్లపై కార్యాచరణ ప్రకటన
- మరోసారి రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి
సహనం వందే, న్యూఢిల్లీ:
వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే ఆమోదించాలని కోరుతూ మరోసారి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడానికి తన మంత్రివర్గ సభ్యులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వచ్చారు. రాష్ట్రపతి గారి అపాయింట్‌మెంట్ లభిస్తే, ఈ బృందం మొత్తం కలిసి ఆమెను వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై ఆయనకు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో స్థానిక సంస్థల్లో పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.
కేంద్రం నుంచి సహకారం కరవు…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిందని, అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉన్న గత చట్టం అడ్డంకిగా మారడంతో, ఆ పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారని, ఈ మూడింటిని తక్షణమే ఆమోదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వపరంగా తాము అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కేంద్రం సహకరించకపోవడం వల్లనే ఈ సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
బీసీల హక్కుల కోసం పోరాటం…
తమ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం పట్ల చిత్తశుద్ధితో ఉందని, అందుకే మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని, తదుపరి కార్యాచరణపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసింది వారేనని ఆయన ఆరోపించారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోరాటం కేవలం ఒక పార్టీది కాదని, బీసీల భవిష్యత్తుకు సంబంధించినదని ఆయన ఉద్ఘాటించారు.