- ఎన్నికల్లో ఓటర్ల జాబితా మాయం
- కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపాటు
- అక్రమాల్లో కేంద్రం పాత్ర ఉందని విమర్శ
- ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆవేదన
సహనం వందే, న్యూఢిల్లీ:
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యం
రాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోటి మందికి పైగా కొత్త ఓటర్లను జోడించారని, బిహార్‌లో 52 లక్షల మంది ఓటర్లను తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం సాధారణం కాదని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే చర్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం నిర్లక్ష్యం…
ఎన్నికల సంఘం తమ ఆరోపణలపై స్పందించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితా, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను అందించాలని తాము పదేపదే కోరినప్పటికీ, ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఒక్కో ఓటర్‌కు ఓటు వేయడానికి సగటున మూడు నిమిషాలు పడుతుందని, అలాంటప్పుడు మహారాష్ట్రలో రెండు గంటల్లో 65 లక్షల మంది ఓటు వేశారని చెప్పడం అసంబద్ధమని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం…
ఈ అవకతవకలు దేశంలో ఎన్నికల వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగమని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తాము చెప్పే నిజాలకు భయపడుతోందని ఆయన అన్నారు. ఈ ఓటర్ల జాబితా మాయం వెనుక అధికార పార్టీ కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇండియా కూటమి ఏకగ్రీవ మద్దతు…
రాహుల్ గాంధీ ఈ ఆరోపణలను ఇండియా కూటమి నాయకుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల్లో జరిగిన ఈ దారుణాల గురించి ఆధారాలతో సహా వివరించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము అన్ని రకాలుగా పోరాడతామని ఇండియా కూటమి నాయకులు ప్రకటించారు.
ప్రజలకు రాహుల్ పిలుపు…
దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఓ సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల అక్రమాలు మీ భవిష్యత్తును దెబ్బతీసే కుట్ర అని, దీన్ని అడ్డుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తమ బాధ్యతను నిర్వర్తించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి.