మానవత్వం లేని నిర్మాత – హీరోలకు వందల కోట్లిస్తారు… కార్మికులకు రూ. 100 పెంచమంటే ఏడుస్తారు

  • వేతనాలు పెంచని సినీ పెద్దల విలనిజంపై కార్మికుల ఆగ్రహం
  • మూడు రోజులుగా టాలీవుడ్‌లో వేతనాల యుద్ధం
  • సమస్యను పరిష్కరించడంలో బడా హీరోలు, సినీ బాబుల వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న యుద్ధం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలకు మధ్య నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీనికితోడు కొన్నిచోట్ల జరుగుతున్న షూటింగ్‌లను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నారు.

నిర్మాతల వైఖరిపై కార్మికుల ఆగ్రహం…
హీరోలకు వందల కోట్లు ఇచ్చే నిర్మాతలు, తమకు రోజువారీ వేతనం 100 రూపాయలు పెంచడానికి ఎందుకు భయపడుతున్నారని సినీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగేళ్లుగా వేతనాల పెంపు గురించి అడగలేదని, ఇప్పుడు అడిగితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి డాన్సర్లు, హెయిర్‌ డ్రెస్సర్లు, లైట్‌మెన్లను తీసుకొచ్చే ఖర్చులో సగం తమకిచ్చినా తమ బతుకులు మారతాయని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు నెల మొత్తం జీతం వస్తే, తమకు నెలలో సగం రోజులు కూడా పని ఉండదని… అందుకే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

షూటింగ్‌లను అడ్డుకుంటున్న కార్మికులు
ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం మేరకు కార్మికులు షూటింగ్‌లకు హాజరుకావడం లేదు. వేతనాలు పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్‌ను అడ్డుకోవడం పెద్ద వివాదంగా మారింది. అలాగే సారథి స్టూడియోస్‌లో జరుగుతున్న సీరియల్ షూటింగ్‌ను అడ్డుకునే క్రమంలో కాస్ట్యూమర్స్ యూనియన్‌కు చెందిన ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. యూనియన్ కార్యదర్శి నరసింహ, సభ్యుడు సత్యనారాయణ మధ్య జరిగిన వాగ్వాదం దాడి వరకు వెళ్లింది. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

నిర్మాతల అల్టిమేటం…
కార్మికుల సమ్మెకు స్పందించిన నిర్మాతల మండలి కూడా గట్టిగా సమాధానం ఇస్తోంది. యూనియన్ల నుంచి మాత్రమే కార్మికులను తీసుకోవాల్సిన అవసరం లేదని, దేశంలో ఎక్కడైనా లోకల్ టాలెంట్ అందుబాటులో ఉన్నప్పుడు ముంబై, చెన్నై నుంచి కూడా తీసుకొని షూటింగ్‌లు పూర్తి చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. వేతనాలు పెంచడంపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషనర్‌ను కలిసి ఈ సమస్యను విన్నవించారు. చిరంజీవిని కలిశారు. ఇతర సినీ పెద్దలతోనూ చర్చలు జరుపుతున్నారు. కానీ ఇవేవీ పరిష్కారం దిశగా అడుగులు ముందు పడడం లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వెండితెరపై విరామం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *