రాహుల్ దూరం… రేవంత్ పరేషాన్ – బీసీ ధర్నా వైపు కన్నెత్తి చూడని అధిష్టానం

  • ఢిల్లీలో నిర్వహించినా పట్టించుకోని దుస్థితి
  • తీవ్రమైన నిరాశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కనీసం ఖర్గే, ప్రియాంక వచ్చినా సరిపోయేది
  • ఎవరూ రాకపోవడంపై కంగుతిన్న నేతలు

సహనం వందే, న్యూఢిల్లీ:
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నా కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధిష్టానం నుంచి ఎవరూ రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

రాహుల్ గాంధీ ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కనీసం ప్రియాంక గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే వంటి నేతలైన వచ్చి ఉంటే బాగుండేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు… పార్టీ అధిష్టానమే పట్టించుకోకపోవడంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి అధిష్టానం ఎందుకు దూరంగా ఉందోనన్న చర్చలు జరుగుతున్నాయి.

బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం శ్రద్ధ లేదంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని నేతల అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద అంతగా పరపతి లేదన్న భావన కూడా కలుగుతుందని అంటున్నారు. ఈ పరిణామాల పట్ల రేవంత్ తీవ్ర నిరాశ నిస్పృహాలకు గురైనట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.

బీసీలలో మైలేజీ వచ్చేనా?
బీసీలకు విద్య.. ఉద్యోగాలు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా వారి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణలోని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అందుకోసం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించటం… రాష్ట్రపతికి పంపటం తెలిసిందే. అయితే అసెంబ్లీలో తీర్మానం చేసినంత సింఫుల్ గా రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీల విషయంలో.. వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు రేవంత్ సర్కారు నడుం బిగించింది.ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారీ ధర్నా నిర్వహించింది. బీసీల మనసును దోచుకోవటంతోపాటు… పొలిటికల్ మైలేజ్ లక్ష్యంగా చేస్తున్న మహాధర్నా వల్ల బలహీన వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మద్దతు లభిస్తుందోనన్న చర్చ జరుగుతుంది. 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగితేనే ఆ పార్టీకి బీసీల మద్దతు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అంత సులువుగా బీసీల రిజర్వేషన్లను పెంచే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అటువంటప్పుడు బీసీలు కాంగ్రెస్ పోరాటాన్ని నమ్మగలుగుతారా లేదా అన్నది మున్ముందు చూడాల్సి ఉంటుందని అంటున్నారు.

మోడీపై రేవంత్ ఫైర్.‌.‌.
ఢిల్లీలో జరిగిన బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా డిమాండ్‌ను ఆమోదిస్తారా? మిమ్మల్ని గద్దె దించాలా?’ అని సవాల్ విసిరారు. మోదీ, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్‌ బిల్లులను అడ్డుకొని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్‌ వారికి కడుపుమంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢీల్లీ ధర్నాకు వంద మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం 4 కోట్ల మంది ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు. మా ఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోడీ మన బద్ధశత్రువు… బలహీనవర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామచంద్రరావుకు ఏమైంది? తెలంగాణలో మీరు బలహీనవర్గాలను ఓట్లు అడగలేదా? ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా?’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించి, రాహుల్‌గాంధీని ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఢిల్లీ ధర్నా అట్టర్ ప్లాప్: హరీష్ రావు
బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు… కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదనీ… బీసీల కన్నా బీహారే ముఖ్యమని మల్లిఖార్జున ఖర్గే రాలేదని ఆరోపించారు. ‘మీ ధర్నాలో నిజాయితీ లేదని… బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై రాహుల్ గాంధీ, ఖర్గేలతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం లేదని సుస్పష్టం అయ్యింద’ని హరీష్ రావు విమర్శించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *