ప్రజావాణి … ‘హైడ్రా’బాణి – రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

  • నివాస ప్రాంతాల‌కు పార్కులే ప్రాణం
  • లేఔట్ ప్ర‌కారం కాపాడుతామ‌న్న క‌మిష‌న‌ర్‌

సహనం వందే, హైద‌రాబాద్‌:
హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తోంది. ప్రజా గొంతుకగా మారుతుంది. అందుకోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ప్రజావాణి చేపట్టారు. సోమవారం నిర్వహించిన ప్ర‌జావాణికి 58 ఫిర్యాదులందాయి. ఇందులో అధిక‌భాగం పార్కుల క‌బ్జాలు, ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల కాజేత ప్ర‌యత్నాల‌పై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌, లేఔట్ల‌తో పాటు.. ఎన్ఆర్ ఎస్‌సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డుల‌ను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్లో చూసి.. ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఆదేశించారు. అక్క‌డిక‌క్క‌డే ఫిర్యాదుల‌ను క్షేత్ర‌స్థాయిలో విచారించాల‌ని అసెట్ ప్రొటెక్ష‌న్ అధికారుల‌కు అప్ప‌గించారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి గడువును కూడా ఫిర్యాదుదారుల ముందే నిర్ణ‌యించారు.

కురుమ సంఘం ప్ర‌తినిధులు ఆవేదన…
సికింద్రాబాద్‌లోని బోయిగూడ స‌మీపంలో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఉన్న స‌మ‌యంలో కురుమ శ్మ‌శాన‌వాటిక కోసం ప్ర‌త్యేకంగా 2 వేల గ‌జాల స్థ‌లాన్ని కేటాయించ‌గా.. నేడ‌ది నామ రూపాలు లేకుండా క‌బ్జాలకు గురైంద‌ని కురుమ సంఘం ప్ర‌తినిధులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికీ అక్క‌డ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, షెడ్డులు వేసి ఆక్ర‌మించేశార‌ని.. అక్క‌డ త‌మ పూర్వీకుల స‌మాధులున్నాయ‌ని రాంగోపాల్‌పేట డివిజ‌న్ కార్పొరేట‌ర్ చీర‌ సుచిత్ర‌, తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు చీర శ్రీ‌కాంత్ త‌దిత‌రులు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారించి శ్మ‌శానాన్ని కాపాడాలంటూ కోరారు.

లే ఔట్ ప్ర‌కారం పార్కును కాపాడండి…
కుత్బుల్లాపూర్ మండ‌లం బాచుప‌ల్లి గ్రామంలో శ్రీ సాయి కృష్ణ కాల‌నీలో 1700 గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడాలంటూ అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. 4.8 ఎక‌రాల లే ఔట్‌లో ఈ స్థ‌లాన్ని పార్కుకోసం కేటాయించార‌ని… నిజాంపేట మున్సిప‌ల్ అధికారులు ఫెన్సింగ్ వేస్తుండ‌గా క‌బ్జాదారులు కోర్టుకు వెళ్లి ఆ ప‌నులు ఆపేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. లే ఔట్ ప్ర‌కారం పార్కును కాపాడి పిల్ల‌లు ఆడుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు.

ర‌హ‌దారి ఆక్రమణ…
గండిపేట్ పంచాయతీ పరిధిలోని స‌ర్వే నంబ‌రు 69లో లే ఔట్ ప్ర‌కారం 25 అడుగుల ర‌హ‌దారి ఉండ‌గా దానిని ఆక్ర‌మించేశార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ర‌హ‌దారిపై హ‌క్కు త‌మ‌కే ఉందంటూ బెదిరిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా క‌రెంటు స్తంభాలు, తాగునీటి పైపులైన్లున్నా… రోడ్డు కాద‌ని వాదిస్తున్నార‌ని, దీంతో వంద‌లాది కుటుంబాల‌కు దారి లేకుండా అవుతోంద‌ని వాపోయారు.

3500 గ‌జాల స్థ‌లం కబ్జాలపాలు…
కుత్బుల్లాపూర్ మండ‌లం భ‌గ‌త్ సింగ్ న‌గ‌ర్ లో 3500 గ‌జాల స్థ‌లాన్ని ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించ‌గా.. ఇప్పుడ‌ది క‌బ్జాల పాలౌతోంద‌ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి స్థ‌ల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఫిర్యాదు చేసింది. దీనిని కాపాడేందుకు జీహెచ్ఎంసీ నిధులు కేటాయించిందని… ఈ స్థ‌లాన్ని కాపాడితే, అక్క‌డ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి నిర్మాణం జ‌రుగుతుంద‌ని క‌మిటీ ప్ర‌తినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *