- సరోగసి సెంటర్లపై కఠిన చర్యలకు ఆదేశం
- ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు
- పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి
- ఏఎన్‌ఎంలు, ఆశాల సాయంతో అక్రమాలు
సహనం వందే, హైదరాబాద్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ వంటి సెంటర్లలో అక్రమాలకు వీలు కల్పించిన ప్రభుత్వ అధికారులు, మెడికల్ కౌన్సిల్ వంటి సంస్థల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని… అందులో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. మాతృత్వం ఆశతో వచ్చేవారిని వ్యాపార వస్తువులుగా మార్చిన కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగసి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
అక్రమాలపై నివేదికలు…
కొన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లు, సంతానోత్పత్తి కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 2021 నాటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) చట్టం, సరోగసీ (నియంత్రణ) చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తున్నారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ లేకపోవడం, వీర్యకణాల దానంలో… సరోగసి ఏర్పాట్లలో పారదర్శకత కొరవడడం వంటి ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు…
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఉన్నతాధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆరోగ్యశ్రీ సీఈవో, డీఎంఈ – ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ క్లినిక్‌లు, సంతానోత్పత్తి కేంద్రాలను తనిఖీ చేస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది.
కమిటీ విధులివే…
కమిటీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల పనితీరును పరిశీలించడం, రిజిస్ట్రేషన్ పత్రాలు, రోగి సమ్మతి పత్రాలు, వీర్యకణాల సేకరణ, విధానపరమైన డాక్యుమెంటేషన్ సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం వంటివి కమిటీ ప్రధాన విధులు. ఇప్పటికే ఈ క్లినిక్‌లపై నమోదైన ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు, తీసుకున్న చర్యల వివరాలను సేకరిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు కూడా చేస్తుంది.
పది రోజుల్లో నివేదికకు హుకూం…
కమిటీ తన విచారణను పూర్తి చేసి పది రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఏ అధికారి లేదా నిపుణుడిని అయినా విచారణ కోసం పిలిపించే అధికారం కమిటీకి ఉంది. ఈ తనిఖీల వల్ల అక్రమాలకు పాల్పడిన క్లినిక్‌లు గుర్తింపు రద్దు లేదా కఠిన చర్యలు ఎదుర్కోవడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సాయం…
డాక్టర్ నమ్రత తన దందా కోసం గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేది. ఈ క్యాంపుల ద్వారా పేద మహిళలను ట్రాప్ చేసి, అద్దె గర్భం పేరుతో పిల్లలను అక్రమంగా విక్రయించేదని వెల్లడైంది. పుట్టిన పిల్లలు అద్దె గర్భం ద్వారా పుట్టారని నమ్మించి బాధితులకు టోకరా వేసేదని విచారణలో తేలింది. ఈ అక్రమాలకు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాలో ఏ3 కల్యాణి, ఏ6 సంతోషి కీలకపాత్ర పోషించారని పోలీసులు వెల్లడించారు. వీరి ద్వారానే పిల్లల అక్రమ రవాణా సాగేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.