- బస్తీతో దోస్తీ కార్యక్రమం ప్రారంభం
- పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యం
సహనం వందే, హైదరాబాద్:

కూలగొట్టుడు కాదు.. పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా అంటే భయం కాదని… నగర ప్రజలందరికీ ఓ అభయం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నగర ప్రజలకు సూచించారు. 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పని వాళ్లకోసం ఒక షెడ్డు వేసి… దానిని తొలగించినప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా శనివారం టోలీచౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కార్యక్రమంలో వివిధ బస్తీల నుంచి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రసంగించారు.
పేదలు… సామాన్యుల పక్షమే
హైడ్రా ఎప్పుడూ పేదలు, సామాన్యుల పక్షమే అని రంగనాథ్ అన్నారు. హైడ్రాను బూచిగా చూపించి వారి కబ్జాలను, ఆక్రమణలను కాపాడుకోడానికి బడాబాబులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేదలు ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని
ఉంటే వాటిని తొలగించబోమని… ఒక వేళ తప్పని సరైతే వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా నివాసాన్ని చూపించి మాత్రమే హైడ్రా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం కూడా ఇదేనని తెలిపారు. ‘మూసీనది సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదు… నదీప్రవాహానికి అడ్డంగా మారిన కబ్జాలను తొలగించాం. ఇలా 10 ఎకరాల మేర కబ్జా చేసి నెలకు రూ. కోటి ఆదాయం పొందుతున్నవారి భరతం పట్టామ’న్నారు.
నాలాలు, చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
నాలాలను, చెరువులను కాపాడడం అందరి బాధ్యతగా భావించాలని రంగనాథ్ అన్నారు. షేక్‌పేట, టోలీచౌక్ ప్రాంతంలోని విరాట్‌నగర్, బసవతారకం నగర్ ప్రాంతంలో నాలాల్లో పరుపులు, దిండులు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏళ్లుగా పేరుకుపోవడంతో గతంలో వరద ముంచెత్తేది. పది రోజులుగా నాలాల పూడికను తొలగించడంతో ఇప్పుడు వరద సాఫీగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన స్థానిక కార్పొరేటర్లు, బస్తీల నాయకులతో పాటు ప్రజలను అభినందించారు. ఆరోగ్యమైన వాతావరణంలో బతకడం ఓ హక్కు అని… దీనిని అందరూ కలిసి సాధించుకోవాలన్నారు. చారిత్రక బుల్కాపూర్ నాలాను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ సహకరించాలన్నారు.
పేదల పక్షం అని రుజువైంది…
హైడ్రా పేదల పక్షమని మరోసారి రుజువైందని జూబ్లీహిల్స్, షేక్‌పేట కార్పొరేటర్లు వెంకటేష్, ఫరాజ్‌లు అన్నారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక్కడ నాలాలు పొంగి నివాసాలను ముంచెత్తుతున్నాయనగానే హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకున్నారు.